పూణెలోని హింజెవాడి ఐటీ పార్క్‌లో పని చేస్తున్న 23 ఏళ్ల ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన కార్యాలయ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పియూష్ అశోక్ కవాడేగా గుర్తించారు. గత ఏడాది జూలై నుంచి అట్లాస్ కాప్కో (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో కార్యాలయంలో సమావేశం జరుగుతోంది. ఉన్నట్టుండి సమావేశం నుంచి బయటకు వెళ్లి అంతస్తు పైనుంచి కిందకు దూకేశాడు. ఒక సూసైడ్ నోట్ వదిలి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నోట్‌లో ఉన్న సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: New York: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. పోలీసు అధికారితో సహా ఐదుగురు మృతి
కార్యాలయంలో పని ఒత్తిడికి సంబంధించిన విషయాలు ఏవీ లేవని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సునీల్ కురాడే తెలిపారు. సూసైడ్ నోట్‌ను పూర్తిగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అసలు ఆత్మహత్యకు దారి తీసిన కారణాలను అన్వేషిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: S Jaishankar: ఆపరేషన్ సిందూర్‌కు ముందు ఏం జరిగిందంటే..!