Quarrel with wife: తన భార్యతో గొడవ పడిన 45 ఏళ్ల వ్యక్తి పూణేలోని పవన నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, అనూహ్యంగా అతను 8 గంటల తర్వాత ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. పోలీసులు, అగ్నిమాపక దళాలు గంటల పాటు రెస్య్కూ ఆపరేషన్ నిర్వహించిన అతడి ఆచూకీ లభించలేదు, చివరకు నదిలోని పొదలల్లో వేలాడుతున్న స్థితిలో కనిపించాడు. వరదతో ఉప్పొంగుతున్న నదిలో ఇంత సేపు ఎలా జీవించి ఉన్నాడో తెలియక అధికారులు షాక్ అవుతున్నారు. చివరకు అతడు సజీవంగా బయటపడటంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే చించ్‌వాడ్‌లోని చించ్‌వాడేనగర్‌కి చెందిన అబాసాహెబ్ కేశవ్ పవార్ శనివారం ఉదయం 11 గంటలకు వాల్హెకర్‌వాడి ప్రాంతంలోని జాదవ్ ఘాట్ వద్ద పావన నదిలోకి దూకాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వారు పింప్రి-చించ్వాడ్ అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. తాగుడుకు బానిసైన పవార్, తన భార్యతో గొడవ పడి నదిలో దూకినట్లు చెప్పారు. ఫైర్ సిబ్బందితో పాటు స్థానిక అధికారులు అతడి కోసం నదిలో శోధించారు. అగ్నిమాపక అధికారి గౌతమ్ ఇంగ్వాకే మాట్లాడుతూ.. ‘‘మేము చెట్టు కొమ్మకు వేలాడుతున్న చొన్నాను గుర్తించాము. అప్పుడు ప్రవాహం తీవ్రంగా ఉన్న నదిలో చెట్లు, పొదల్లో వెతకడం ప్రారంభించాము. అయినప్పటికీ అతడి జాడ కనుగొనలేకపోయాము’’ అని చెప్పారు.
Read Also: Alluri District: ఏపీలో తప్పిన పెను ప్రమాదం.. వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, 20 మంది సేఫ్
కుటుంబ సభ్యుల ముందే పవార్ నదిలోకి దూకినట్లు ఇంగ్వాలే చెప్పారు. పావన డ్యాం నుంచి 4000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేయడంతో నది తీవ్ర ప్రవాహాంతో ఉంది. అయితే, కేశవ్ పవార్ ఈత కొట్టడంతో నిష్ణాతుడని అధికారులు గుర్తించారు. దీంతో అతను చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా ఉండొచ్చని అధికారులు భావించారు. చాలా సేపటి వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించినప్పటికీ అతడి జాడ కనుగొనలేకపోయారు. రాత్రి సమయం కావడంతో సెర్చ్ ఆపరేషన్ నిలిపేశారు.రాత్రి 8 గంటలకు నది ఒడ్డున అతడిని గుర్తించినట్లు ఫోన్ వచ్చిందని ఇంగ్వాలే చెప్పారు. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నదిలో మునిగిపోకుండా పొదల్లో వేలాడుతున్నట్లు ఓ వ్యక్తి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో అతడిని రక్షించారు.