Zika Virus: మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం రేపింది. మహారాష్ట్రలోని పూణె నగరంలో 46 ఏళ్ల డాక్టర్, ఆయన కుమార్తెకు జికా వైరస్ ఇన్‌ఫెక్షన్ సోకినట్లు నిర్ధరణ అయింది. అయితే వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని బుధవారం ఒక అధికారి తెలిపారు. ఆ వైద్యుడికి ఇటీవల జ్వరం, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపించాయి. ఆ తర్వాత ఆయనను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. రక్త నమూనాలను సేకరించి నగరానికి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)కి పంపించారు. జూన్ 21న వారికి జికా వైరస్ ఇన్‌ఫెక్షన్ పాజిటివ్ అని నివేదికలు ధృవీకరించాయని పూణే మున్సిపల్ కార్పొరేషన్ (PMC) ఆరోగ్య అధికారి తెలిపారు. డాక్టర్ నగరంలోని ఎరంద్‌వానే ప్రాంతంలో నివాసి అని వెల్లడించారు. అనంతరం వైద్యుడి కుటుంబ సభ్యుల రక్త నమూనాలను విశ్లేషించగా.. ఆయన 15 ఏళ్ల కుమార్తెకు కూడా జికా వైరస్ సోకినట్లు గుర్తించారు. దీంతో వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నారు.
Read Also: Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణకు కోర్టులో చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ
జికా వైరస్ వ్యాధి సోకిన ఏడెస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఇది డెంగ్యూ, చికున్‌గున్యా వంటి ఇన్‌ఫెక్షన్లను కూడా వ్యాప్తి చేస్తుంది. 1947లో ఉగాండాలో తొలిసారిగా ఈ వైరస్‌ను గుర్తించారు.నగరంలో ఈ రెండు కేసులు నమోదైన తర్వాత, పుణె మున్సిపల్ కార్పొరేషన్ విభాగం నిఘా నిర్వహించడం ప్రారంభించిందని అధికారి తెలిపారు.ఈ ప్రాంతంలో ఇతర అనుమానిత కేసులు కనిపించనప్పటికీ, దోమల వృద్ధిని అరికట్టడానికి అధికారులు ఫాగింగ్, ఫ్యూమిగేషన్ వంటి ముందస్తు చర్యలు చేపట్టడం ప్రారంభించారని ఆయన చెప్పారు. “రాష్ట్ర ఆరోగ్య శాఖ ద్వారా దోమల నమూనాలు సేకరించబడ్డాయి. మేము ఈ ప్రాంతంలో సాధారణ ప్రజలకు అవగాహన కల్పించాము. ఆ ప్రాంతంలోని గర్భిణీ స్త్రీల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి సూచనలు ఇచ్చాము. జికా సాధారణంగా తీవ్రమైన సమస్యలకు దారితీయదు, గర్భిణీ స్త్రీకి వ్యాధి సోకితే, అది పిండంలో మైక్రోసెఫాలీకి కారణం కావచ్చు,” అని ఆ అధికారి చెప్పారు.