PM Narendra Modi: దేశంలో వేగంగా విమానయాన రంగం విస్తరిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మరికొన్ని రోజుల్లో కర్ణాటకలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అక్కడి అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు మోదీ. మరోసారి కర్ణాటకలో అధికారం చేజిక్కించుకోవాలని అనుకుంటోంది బీజేపీ. దీంతో భాగంగానే కొద్ది రోజుల వ్యవధిలో రెండుసార్లు కర్ణాటకలో పర్యటించారు ప్రధాని. ఇదిలా ఉంటే సోమవారం శివమొగ్గలో నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. హవాయ్ చెప్పులేసుకునే వారు కూడా విమానం ఎక్కాలన్న తమ సంకల్పం ఇప్పుడు నెరవేరుతోందని అన్నారు.
Read Also: Chhattisgarh: తాను చనిపోయి కూతురును కాపాడిన తల్లి.. 30 నిమిషాల పాటు అడవి పందితో పోరాటం
దేశంలో విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని, రాబోయే కాలంలో దేశానికి వేలాది విమానాలు అవసరం ఉంటాయని అన్నారు. మేడ్ ఇన్ ఇండియా విమానాలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే రోజూ ఎంతో దూరంలో లేదని మోదీ అన్నారు. దేశమంతా విమాన మార్గాలను విస్తరించాలనే ఆలోచనలో శివమొగ్గ విమానాశ్రయాన్ని రూ.400 కోట్లతో నిర్మించామని, ప్రతీ గంటలకు 300 మంది ప్రయాణికులు వెళ్లేలా టెర్మినల్ నిర్మించినట్లు చెప్పారు. మల్నాడు ప్రాంతం ప్రజలు ముంబై, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ వెళ్లేందుకు ఈ ఎయిర్ పోర్టు ఉపయోగపడుతుందని అన్నారు. మాజీముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కలల ప్రాజెక్టు అని, ఆయన 80 జన్మదినం రోజే దీన్ని ప్రారంభించడం విశేషం అని కొనియాడారు.
ప్రధాని పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ చీఫ్ మల్లికార్జన ఖర్గేని ఉద్దేశించి మాట్లాడారు. ఖర్గే పేరుకు మాత్రమే అధ్యక్షుడని రిమోట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉందో ప్రపంచానికి అంతా తెలుసని పరోక్షంగా గాంధీ కుటుంబాన్ని విమర్శించారు. ఖర్గే సాధ్యమైనంత రీతిలో ప్రజలకు సేవలు అందించారని.. అయితే ఇటీవల ఆ పార్టీ ప్లీనరీలో ఆయనను అవమానించడం చూసి నిరాశ చెందానని అన్నారు.
