PM Modi Speech In Parliament: పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. కాంగ్రెస్ పై ఘాటు విమర్శలు గుప్పించారు. 2008లో పార్లమెంట్ పై తీవ్రవాదుల దాడులను ఎవరూ మర్చిపోలేలని అన్నారు. 2004 నుండి 2014 కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలనలో ఉగ్రవాదం, హింస, కుంభకోణాలే ఉన్నాయని.. ప్రతీ విషయాన్ని సంక్షోభంగా మార్చడం యూపీఏకు అలవాటు అంటూ మండిపడ్డారు.
2004-14 మధ్య ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉందని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ దశాబ్దం అత్యంత అవినీతిమయం అని ఆరోపించారు. యూపీఏ పదేళ్ల పాలనలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం మొత్తం ఉగ్రవాదంతో అట్టుడుకిందని, జమ్మూకాశ్మీర్ నుంచి ఈశాన్య వరకు మొత్తం ఈ ప్రాంతం హింస తప్ప మరేమీ చూడలేదని.. ఆ 10 సంవత్సరాలలో, ప్రపంచ స్థాయిలో భారతదేశం చాలా బలహీనంగా ఉందని, ఆ సమయంలో భారతదేశం మాట వినడానికి కూడా ఎవరూ సిద్ధంగా లేరని అన్నారు. 2004-2014 మధ్య, యూపీఏ ప్రతి అవకాశాన్ని సంక్షోభంగా మార్చిందని విమర్శించారు.
Read Also: PM Narendra Modi: నా జీవితం దేశానికే అంకితం.. నా రక్షణ కవచాన్ని మీరు ఛేదించలేరు..
నిన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రాసిన విమర్శలపై సెటైర్లు వేశారు ప్రధాని మోదీ. భారత విధ్వంసం హార్వర్డ్ లో కేస్ స్టడీ అవుతుందని కాంగ్రెస్ చెప్పిందని.. అయితే గత కొన్ని సంవత్సరాలకు ముందే కాంగ్రెస్ పతనం గురించి ‘ది రైజ్ అండ్ డిక్లైన్ ఆఫ్ ఇండియాస్ కాంగ్రెస్ పార్టీ’ గురించి అధ్యయనం చేశారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో తీవ్రవాదులు రెచ్చిపోయారని, తీవ్రవాదాన్ని ఎదుర్కొలేకపోగా, రక్షణ రంగంలో హెలికాప్టర్ల కుంభకోణం జరిగిందని ప్రధాని మోదీ విమర్శించారు. కామన్వెల్త్, కోల్ గేట్ స్కామ్ లపై కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.
2004-2014 కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని.. ఆ దశాబ్ధం భారతదేశం నష్టపోయిందని..2020 నుంచి 2030 దశాబ్ద కాలం “ఇండియా డికేడ్” గా ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలు, ఫలితాల వంటివి ప్రతిపక్షాలను ఒకే వేదికపైకి తీసుకువస్తాయి, కానీ దర్యాప్తు సంస్థలైన ఈడీ వల్ల ప్రతిపక్షాలు ఏకం అవుతున్నాయని, ఈడీకి థాంక్స్ అంటూ సెటైర్లు పేల్చారు.