Droupadi murmu: ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమల పర్యటన ఖరారైంది. ఈ నెల 19న ఆమె శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోనున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా ద్రౌపది ముర్ము శబరిమల పర్యటనకు వెళ్తున్నారు. ఈ నెల 18న కొట్టాయం చేరుకుంటానని, 19న శబరిమల సందర్శన చేస్తానని ప్రకటన వెలువడింది. రాష్ట్రపతి భవన్ ఈ కార్యక్రమ వివరాలను ఈ రోజు కేరళ ప్రభుత్వానికి అందించింది. రాష్ట్రపతి తన కేరళ పర్యటనలో భాగంగా కొట్టాయం, పతనంతిట్ట జిల్లాలను సందర్శిస్తారు.
Read Also: PM Modi: వాయుసేనను ఎందుకు కలవాల్సి వచ్చిందో వివరించిన మోడీ
మాజీ రాష్ట్రపతి వివి గిరి తర్వాత ద్రౌపదిముర్ము శబరిమలను దర్శించిన రెండో రాష్ట్రపతి అవుతారు. మే 18న రాష్ట్రపతి కేరళలోని కొట్టాయం జిల్లాలోని పాలాలో ఉన్న సెయింట్ థామస్ కాలేజ్ జూబ్లీ సమావేశంలో పాల్గొంటారని తెలుస్తోంది. కొట్టాయంలో ఉన్న కుమారకోమ్‌లో ఆమె బస చేస్తారు. మే 19న రాష్ట్రపతి హెలికాప్టర్ ద్వారా నీలక్కల్ చేరుకుంటారు. నీలక్కల్ నుండి, రాష్ట్రపతి రోడ్డు మార్గంలో పంబకు ప్రయాణించి, ఆపై కాలినడకన శబరిమల ఆలయానికి వెళ్లే అవకాశం ఉంది. రాష్ట్రపతి సందర్శనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కేరళ ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది.
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మందిని పాక్ ప్రేరేపిత లష్కరేతోయిబా ఉగ్రవాదులు బలితీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో రాష్ట్రపతి కీలక భేటీల్లో పాల్గొన్నారు. ఉగ్రదాడి తర్వాత అమిత్ షా, జైశంకర్ వంటి మంత్రులు ఆమెతో భేటీ అయ్యారు. ఇటీవల, ప్రధాని నరేంద్రమోడీ కూడా రాష్ట్రపతిని కలిశారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత, ప్రస్తుతం రెండు దేశాల మధ్య కాల్పులు నిలిచిపోయాయి.