Coconut: ఇటీవల కాలంలో చిన్న చిన్న విషయాల్లో పెళ్లిళ్లలో గొడవలకు దారి తీస్తున్నాయి. వధూవరుల కుటుంబాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని పెళ్లి పెటాకులు అయ్యే వరకు వెళ్తున్నాయి. విందు భోజనాల్లో సరిగ్గా ముక్కలు పడలేదని, తమకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదని ఇరు కుటుంబాలు గొడవలకు దిగిన సందర్భాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో శనివారం ఓ పెళ్లిలో వధూవరుల కుటుంబాలు ‘‘కొబ్బరికాయల’’ కోసం పొట్టుపొట్టు కొట్టుకున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Read Also: Anant Ambani Wedding: పెళ్లిలో ఎదురుపడ్డ ఐశ్వర్యరాయ్-రేఖ.. రియాక్షన్ ఇదే!
పెళ్లి ఆచారాల సమయంలో కొబ్బరికాయల కొరతపై ఇరు వర్గాల మధ్య మాటామాట పెరిగి భౌతిక దాడికి దారి తీసింది. పెళ్లికి ముందే వివాహం రణరంగాన్ని తలపించింది. మొదటగా వరుడి తరుపు వారు వధువు కుటుంబంపై దాడి చేశారు. దీనికి ప్రతీకారంగా వధువు బంధువులు పెళ్లి కొడుకు బంధువులపై దాడికి తెగబడ్డారు. దీంతో వరుడి బంధువులు సగానికి పైగా పెల్లి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం చివరకు పోలీస్ స్టేషన్ చేరింది. ఇరు కుటుంబాల మధ్య శాంతి కుదిర్చేందుకు పోలీసులు నాలుగు గంటలు కష్టపడాల్సి వచ్చింది.
గ్వాలియర్‌లోని బెహత్ ప్రాంతానికి చెందిన వధువు నీలు మహౌర్, బిజౌలీ ప్రాంతానికి చెందిన వరుడు ప్రదీప్ మహౌర్ మధ్య వివాహం జరిగింది. సమాచారం ప్రకారం వివాహ ఆచారాలు నిర్వహించే సమయంలో కొబ్బరికాయలు లేకపోవడంపై వధువు కుటుంబీకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పటికే వరుడు కుటుంబం కొబ్బరికాయల్ని సిద్ధం చేసినప్పటికీ, ఇరు వర్గాలు మధ్య గొడవ సద్దుమణగలేదు. గొడవ తీవ్రరూపం దాల్చడంతో చివరకు ఇరు కుటుంబాలకు పోలీసులను ఆశ్రయించాయి. ముందుగా ఇరు కుటుంబాలు ఒకరిపై ఒకరు కేసు పెట్టుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. అయితే, వధూవరులు మాత్రం పెళ్లిని కొనసాగించేందుకు అంగీకారం తెలపడంతో పోలీసుల పర్యవేక్షణలో పెళ్లి జరిగేలా ఒప్పందం కుదిరింది.