Terrorists Attack: జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో గురువారం భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు రెండు ఆర్మీ వాహనాలపై మెరుపుదాడి చేయడంతో ఐదుగురు సైనికులు మరణించగా.. ఇద్దరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3:45 గంటలకు ధేరా కీ గలీ, బుఫ్లియాజ్ మధ్య ధాత్యార్ మోర్ వద్ద ఈ దాడి జరిగిందని అధికారులు తెలిపారు. బ్లైండ్ కర్వ్, ఎగుడుదిగుడుగా ఉన్న రహదారి కారణంగా ఈ సమయంలో ఆర్మీ వాహనాలు వేగాన్ని తగ్గించడంతో పూంచ్ జిల్లాలోని ధాత్యార్ మోర్హ్ ప్రదేశాన్ని ఉగ్రవాదులు దాడి చేయడానికి ఎంచుకున్నారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులు ధేరా కీ గలీ, బుఫ్లియాజ్ మధ్య ధాత్యార్ మోర్ వద్ద ఉన్న కొండపై నుంచి దాడి చేసినట్లు తెలిసింది. అక్కడ నుంచి వారు రెండు ఆర్మీ వాహనాలపై బుల్లెట్ల వర్షం కురిపించారని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
Read Also: AP CID: లోకేష్‌ను అరెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ సీఐడీ పిటిషన్
ఈ అటాక్‌లో ఉగ్రవాదులు అమెరికా తయారీ రైఫిళ్లు 4 కార్బైన్‌ను ఉపయోగించారు. దాడికి పాల్పడిన ఆయుధాలతో ఉగ్రవాదులు సోషల్ మీడియాలో ఫోటోలు విడుదల చేశారు. ఈ ఘటనకు పాకిస్తాన్ ఆధారిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబాకి చెందిన పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్(పీఏఎఫ్ఎఫ్) బాధ్యత ప్రకటించింది.
M4 కార్బైన్ అనేది 1980లలో యునైటెడ్ స్టేట్స్‌లో అభివృద్ధి చేశారు. గ్యాస్ ఆపరేటెడ్, తేలికపాటి మ్యాగజైన్ ఫెడ్ కార్బైన్. ఇది అమెరికా సాయుధ దళాల ఆయుధం. ప్రస్తుతం దీనిని 80కి పైగా దేశాల్లో వాడుతున్నారు. పలు తీవ్రవాద సంస్థలు ఈ ఆయుధాన్ని వాడుతున్నాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్ర సంస్థలకు అనుబంధంగా పలు ఉగ్రసంస్థలు పనిచేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా దాడులకు పథకాలు రచిస్తున్నాయి.