BJP vs Congress: ఢిల్లీ ఎర్రకోట కార్ బాంబ్ దాడిపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఢిల్లీ పేలుడు తర్వాత చిదంబరం మాట్లాడుతూ.. భారతదేశం రెండు రకాల ఉగ్రవాదులను ఎదుర్కొంటుందని ఆయన అన్నారు. విదేశాల నుంచి వచ్చినవారు కొందరైతే.. దేశంలో తయారవుతున్న స్వదేశీ ఉగ్రవాదులు మరి కొందరని తెలిపారు. ఈ విషయాన్ని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని వివరించారు. “పహల్గామ్ దాడికి ముందు, తరువాత దేశంలో రెండు రకాల ఉగ్రవాదులు ఉన్నారని చెప్పానని, అప్పుడు తనను అందరూ ట్రోల్ చేశారని చిదంబరం అన్నారు.
ఈ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. ‘‘కాంగ్రెస్ ఉగ్రవాదులపై సున్నితమైన మద్దతు ఇస్తోంది’’ అని బీజేపీ అధికార ప్రతినిధి ప్రతీప్ భండారి అన్నారు. ఉగ్రవాదులు ‘‘చంపాల్సిన జంతువులు’’ అని మరో బీజేపీ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. ఉగ్రవాదులు గాయపడినప్పడు కాంగ్రెస్ అరవడం ప్రారంభిస్తుందని విమర్శించారు. వారు ఉగ్రవాదుల ప్రతినిధులుగా ఎందుకు మాట్లాడుతారో నాకు అర్థం కావడం లేదని నఖ్వీ విమర్శించారు.
‘‘ఉగ్రవాదులు ఉగ్రవాదులే . కాంగ్రెస్ నాయకులు ఎలా వర్గీకరిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ’’ అని కాషాయ పార్టీ సీనియన్ నేత నళిన్ కోహ్లీ అన్నారు. బీజేపీ మిత్రపక్షం జేడీయూ నేత నీరజ్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులకు ఏం జరుగుతుందో ఆశ్చర్యంగా ఉంది. ఉగ్రవాదానికి కొత్త భాష.? విదేశీ, స్వదేశీ ఉగ్రవాదులా.? ఉగ్రవాది ఉగ్రవాదే’’ అని ఆయన అన్నారు.