Ram Mandir: కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ కుమార్తె సురణ్య అయ్యర్ అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టను ఖండిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని ఉద్దేశిస్తూ, జనవరి 20న సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్ పెట్టింది. దీనిపై ఢిల్లీలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో సుప్రీంకోర్టు న్యాయవాది, బీజేపీ నాయకుడు అజయ్ అగర్వాల్ శనివారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
Read Also: Indian Fishermen: 23 మంది భారత మత్స్యకారుల్ని అరెస్ట్ చేసిన శ్రీలంక..
సురణ్య అయ్యర్ ఫేస్‌బుక్, యూట్యూబ్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తీవ్రమైన అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారు. సెక్షన్ 153-A (మత ప్రాతిపదికన వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), ఐపీసీలోని ఇతర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. రామమందిరం, జాతీయవాదం పేరుతో అయోధ్యలో చేస్తున్న దానికి తాను “భారత ముస్లింలకు” మద్దతుగా నిరాహారదీక్ష చేస్తానని అన్నారు.
ఆమె చేసిన పోస్ట్ వివాదాస్పదమైంది. ఢిల్లీలో ఆమె నివాసం ఉండే జంగ్‌పురాలోని వెల్ఫేర్ అసోసియేషన్(RWA) ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శాంతి, సామరస్యాలకు భంగం కలిగించినందుకు తమ కాలనీ నుంచి వెళ్లిపోవాలని సురణ్యకు లేఖ రాసింది. అయోధ్య రామ మందిరాన్ని వ్యతిరేకిస్తున్న మీరు వేరే కాలనీకి వెళ్లాని కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్, ఆయన కుమార్తెకి లేఖలో పేర్కొన్నారు. అంతకుముందు మణిశంకర్ అయ్యర్ కూడా ఇలాగే ప్రధాని నరేంద్రమోడీపై రామ మందిర నిర్మాణంపై విమర్శలు చేశారు.