PM Narendra Modi: రక్షణ రంగంలో ఎన్నో ఘనతలు సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన భారత్.. ఇవాళ మరో మైలురాయిని అందుకుంది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో, భారతీయుల శ్రమ, మేధస్సుతో రూపుదిద్దుకున్న తొలి విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా భారత జోరుకు ఐఎన్‌ఎస్ విక్రాంత్ సరైన ఉదాహరణ అని మోడీ కొనియాడారు. దీంతో పాటు నౌకా దళానికి సరికొత్త గుర్తును కూడా ఆవిష్కరించారు. వలస పాలన బానిసత్వానికి గుర్తుగా నిలిచిన సెయింట్ జార్జి క్రాస్‌ను తొలగించి, ఛత్రపతి శివాజీ మహారాజు స్ఫూర్తితో నూతన పతాకాన్ని రూపొందించారు. నూతన పతాకంలో ఎడమవైపుపై భాగంలో జాతీయ పతాకం ఉంది. కుడివైపు అష్ట భుజులు రెండు ఉన్నాయి. వాటి మధ్యలో ఓ లంగరుపై భారత జాతీయ చిహ్నం ఉంది. ఈ లంగరు క్రింద ‘సం నో వరుణః’ అనే నినాదం ఉంది. దీనిని వేదాల నుంచి స్వీకరించారు. వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునే మాట ఇది. ‘వరుణ దేవా! మా పట్ల దయ చూపించి, మాకు విజయాన్ని ప్రసాదించు’ అని దీని అర్థం. ఇప్పటివరకు ఉన్న గుర్తు.. దేశ వలసవాద గతాన్ని గుర్తుచేసేలా ఉందని కేంద్రం భావించింది. దీన్ని మార్చి.. మన చరిత్ర నుంచి స్ఫూర్తి పొందేలా ఉండే కొత్త చిహ్నానికి రూపకల్పన చేశారు. మారాఠా సామ్రాజ్యాధినేత ఛత్రపతి శివాజీ మహరాజ్ స్ఫూర్తితో రూపొందించిన ఈ ‘నిషాన్’లో అనేక ప్రత్యేకతలున్నాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా నావికా దళం కోసం కొత్తగా రూపొందించిన పతాకాన్ని మోదీ ఎగురవేశారు. ‘‘ఇప్పటివరకు నౌకాదళానికి బానిస గతాన్ని గుర్తుచేసే చిహ్నం ఉండేది. ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ స్ఫూర్తితో కొత్త చిహ్నాన్ని ఆవిష్కరించుకున్నాం. దేశ బానిసత్వ గతాన్ని ఇది చెరిపేస్తుంది’’ అని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు
నౌకదళం కొత్త చిహ్నంలో ప్రధానంగా రెండు భాగాలున్నాయి. ఎడమవైపు పైభాగంలో మన జాతీయ పతాకాన్ని ఉంచారు. ఇక రెండోది నీలం, బంగారు వర్ణంలో అష్టభుజాకారంలో ఉన్న చిహ్నం. జాతీయ చిహ్నం చుట్టూ ఉన్న బంగారు రంగు బోర్డర్‌కు స్ఫూర్తి ఛత్రపతి శివాజీ మహారాజు రాజముద్ర. ఇది స్థిరత్వాన్ని వెల్లడిస్తుంది. సముద్ర జలాలు, తీరాలపై అత్యంత దార్శనికత కలిగిన భారత రాజుల్లో శివాజీ మహరాజ్ ఒకరు. ఆయన హయాంలో అత్యంత విశ్వసనీయమైన నౌకదళాన్ని నిర్మించారు. ఇందులో 60 ‘యుద్ధ నౌకలు’, దాదాపు 5వేల మంది సైన్యం ఉండేవారని నేవీ ఓ వీడియోలో తెలిపింది. గతంలో భారత తీర రక్షణలో ఈ దళం అత్యంత కీలకంగా పనిచేసింది. విదేశీ దండయాత్రల నుంచి తీరప్రాంతాన్ని కాపాడిన తొలి నావికా దళం ఇదే. ఎనిమిది దిక్కులను సూచించే విధంగా అష్టభుజిని ఏర్పాటు చేశారు. భారత నావికా దళం బహుళ దిశలకు చేరగలదని, అనేక రకాల కార్యకలాపాలను నిర్వహించే సత్తా దానికి ఉందని ఇది తెలియజేస్తుంది.
ఈ అష్టభుజాకార చిహ్నంలో రెండు బంగారు వర్ణ బోర్డర్లు.. నీలం రంగు మధ్యలో జాతీయ చిహ్నం ఉంది. దాని కిందనే ‘సత్యమేవ జయతే’ అనే అక్షరాలను దేవనాగరి లిపిలో నీలం రంగులో రాశారు. ఈ జాతీయ చిహ్నం.. నౌక యాంకర్ ఆకృతిపై నిల్చున్నట్లుగా ఉంది. ఈ రెండింటి కింద భారత నౌకాదళ నినాదం ‘సమ్ నో వరుణః’ అని దేవనాగరి లిపిలో బంగారు వర్ణంలో రాసి ఉంది. దీని అర్థం.. వరుణదేవుడా మాకు అంతా శుభం కలుగుగాక అని. ఇక నేవీ పతాకంలోని తెలుపు రంగు భారత నౌకాదళ ప్రస్తుత సామర్థ్యాలను, నిర్మాణాలు, నౌకలను ప్రతిబింబిస్తుంది. అంతకుముందు నావికాదళ పతాకంలో సెయింట్ జార్జి క్రాస్ ఉండేది. దానికన్నా ముందు తెలుపు రంగుపై రెడ్ క్రాస్, యునైటెడ్ కింగ్‌డమ్ యూనియన్ జాక్ ఉండేవి.