PM Modi: హర్యానాలో బీజేపీ సంచలన విజయం సాధించింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలను కైవసం చేసుకుంది. వరసగా మూడోసారి అధికారం చేపట్టబోతోంది. జమ్మూ కాశ్మీర్‌లో అధికారం చేపట్టలేకపోయినప్పటికీ 90 స్థానాల్లో 29 స్థానాలను సాధించింది. ఇక రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ చావుదెబ్బతింది. రాహుల్ గాంధీ ప్రచారం, అగ్నివీర్ అంశం, నిరుద్యోగం, వినేష్ ఫోగట్ చేరిక, రైతు ఉద్యమాలు ఇలా ఏదీ కూడా బీజేపీ గెలుపుని ఆపలేకపోయాయి. 37 సీట్లలోనే కాంగ్రెస్ గెలిచింది. జమ్మూ కాశ్మీర్‌లో మరింత దారుణం 6 సీట్లను గెలిచింది.
Read Also: Nobel Prize: కెమిస్ట్రీలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతులు
ఇదిలా ఉంటే, హర్యానా ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్రమోడీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిని మోడీ.. హర్యానా ప్రజలు కాంగ్రెస్ దాని అర్బన్ నక్సల్ మిత్రపక్షాల విద్వేషపూరిత కుట్రల్ని అడ్డుకున్నారని చెప్పారు. ‘‘నిన్న, హర్యానా మరియు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు ప్రకటించబడ్డాయి… రెండు పర్యాయాలు పూర్తి చేసిన తర్వాత, హర్యానాలో మూడవసారి ఎన్నికవ్వడం చారిత్రాత్మకం. మొత్తం కాంగ్రెస్ ఎకో సిస్టమ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. వారు దళితుల్లో అసత్యాలు వ్యాప్తి చేయడానికి ప్రయత్నించారు. దళితుల నుంచి కాంగ్రెస్ రిజర్వేషన్‌లను లాక్కొని తమ ఓటు బ్యాంకుకు పంచుతుందని దళితులు గ్రహించారు’’ అని మోడీ అన్నారు.
హర్యానాలో దళిత ప్రజల నుంచి బీజేపీకి రికార్డు స్థాయిలో మద్దతు లభించిందని, కాంగ్రెస్ రైతుల్ని ఉసిగొల్పిందని అన్నారు. బీజేపీ రైతుబంధు పథకాలతో హర్యానా రైతులు సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ యువతను కూడా ఉసిగొల్పే ప్రయత్నాలు చేసిందని, అయినా ప్రజలు బీజేపీనే నమ్మారని ప్రధాని చెప్పారు. నాగ్‌పూర్‌లో రూ. 7600 కోట్లకు పైగా వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోడీ ఈ రోజు శంకుస్థాపన చేశారు. వర్చువల్‌గా నాగ్‌పూర్‌లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు రాష్ట్రంలోని షిర్డీ విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది నవంబర్ నెలలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.