PM Narendra Modi might inaugurate fourth Vande Bharat train: గురువారం రోజున హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నాలుగో వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లోని ఉనా జిల్లాలోన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ నుంచి ఉనాలోని అంబ్ అందౌరా రైల్వే స్టేషన్ల మద్య ఈ రైలు నడవనుంది. బుధవారం మినహా అన్ని రోజులు ఈ రైలు నడుస్తుంది. అంబాలా, చండీగఢ్, ఆనంద్ పూర్ సాహిబ్, ఉనా రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ సదుపాయాన్ని కల్పించారు. ఉదయం 5.50 గంటలకు న్యూ ఢిల్లీ నుంచి బయలుదేరే ఈ రైలు ఉదయం 11.05 గంటలకు అంబ్ అందౌరా స్టేషన్ కు చేరుకుంటుంది. మళ్లీ మధ్యాహ్నం అక్కడ నుంచి బయలుదేరి 6.25 గంటలకు న్యూ ఢిల్లీకి చేరుకోనుంది.
Read Also: Pakistan: హిందూ బాలిక కిడ్నాప్‌పై సింధ్ ప్రభుత్వ ఉన్నత స్థాయి విచారణ
సెప్టెంబర్ 30న భారతదేశంలో మూడో వందేభారత్ రైలును ప్రధాని మోదీ గుజరాత్ గాంధీ నగర్ లో ప్రారంభించారు. గాంధీ నగర్-ముంబై మార్గంలో ఈ రైలు నడుస్తోంది. సెమి హైస్పీడ్ ట్రైన్ గా వందే భారత్ రైలును అభివృద్ధి చేశారు. వైఫై, 32 అంగుళాల ఎల్సీడీ టీవీలు, ఆల్ట్రావయోలెట్ ఎయిర్ ఫ్యూరిఫికేషన్ సిస్టమ్స్ వంటి సేవలు ఈ వందే భారత్ రైలులో ఉన్నాయి.
మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఢిల్లీ-వారణాసిల మధ్య ప్రారంభించారు. రెండో వందే భారత్ రైలును ఢిల్లీ- శ్రీ వైష్ణోదేవి మాతా, కట్రా మధ్య ప్రవేశపెట్టారు. మూడోది గాంధీనగర్-ముంబైల మధ్య, నాలుగో రైలు ఢిల్లీ- అంబ్ అందౌరా మధ్య ప్రయాణించనుంది. ఆగస్ట్ 15, 2023 లోపు 75 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది భారతీయ రైల్వే శాఖ.
అయితే ఇటీవల వందే భారత్ రైళ్లకు వరసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గాంధీనగర్- ముంబై మధ్య ప్రయాణిస్తున్న వందే భారత్ రైలు అహ్మదాబాద్ స్టేషన్ సమీపంలో గేదెలను ఢీకొట్టింది. దీంతో ముందు భాగంలో రక్షణగా ఉండే షీల్డ్ దెబ్బతింది. ఆ తరువాత కూడా మరో రెండు ప్రమాదాలు జరిగాయి.