PM Narendra Modi: భారత ప్రధాని నరేంద్రమోడీ రష్యా పర్యటనకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. జూలై నెలలో ఈ పర్యటన చోటు చేసుకునే అవకాశం ఉందని రష్యన్ మీడియా ఏజెన్సీ ఆర్ఐఏ మంగళవారం నివేదించింది. నిజానికి మే నెలలోనే ప్రధాని మోడీ రష్యా పర్యటనకు వెళ్తానే వార్తలు వచ్చినప్పటికీ, జూలైలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి నెలలో రష్యా ప్రతిష్టాత్మకంగా ప్రధాని నరేంద్రమోడీని తమ దేశంలో పర్యటించాలని ఆహ్వానించింది. జూలైలో జరిగే ప్రధాని పర్యటనలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఆయన భేటీ అవుతారని తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య అనేక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది.
Read Also: Minister Sandhya Rani: దేశ విదేశాల్లో అరకు కాఫీ ప్రమోట్.. రాష్ట్ర వ్యాప్తంగా చైన్ షాపులు..!
ఈ ఏడాది మే నెలలో రష్యా అధ్యక్షుడిగా పుతిన్ వరసగా ఐదోసారి ఎన్నికయ్యారు. మరోవైపు భారత ప్రధానిగా మూడోసారి మోడీ ఈ నెలలో ప్రమాణస్వీకారం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే గెలిచిన తర్వాత పుతిన్ ప్రధానికి అభినందనలు తెలియజేశారు. జూలై నెలలో ప్రధాని మోడీ రష్యాలో పర్యటిస్తే, ఇది 2019 తర్వాత తొలి పర్యటనగా నిలుస్తుంది. చివరిసారిగా 2022లో పుతిన్, మోడీలు ఉజ్బెకిస్తాన్ సమర్ఖండ్‌లో జరిగిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ)లో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఉక్రెయిన్ యుద్ధాన్ని చర్చలు, దౌత్యమార్గాల్లో పరిష్కరించుకోవాలని మోడీ సూచించారు.
2021లో పుతిన్ చివరిసారిగా ఇండియాను సందర్శించారు. వార్షిక ఇండియా-రష్యా సమ్మిట్‌లో భాగంగా దేశానికి వచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోడీ రష్యా పర్యటన కీలకంగా మారే అవకాశం ఉంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అమెరికాతో సహా పాశ్చాత్య దేశాలు రష్యాపై తీవ్ర ఆర్థిక ఆంక్షల్ని విధించాయి. అయినప్పటికీ, భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోంది. దీనిపై పలుమార్లు వెస్ట్రన్ మీడియా, దేశాలు భారత్‌ని విమర్శించాయి.