PM Narendra Modi About Gujarat Cable Bridge Incident: గుజరాత్ రాష్ట్రంలోని మోర్బీ నగరంలో కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనని ఎంతో బాధించిందని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా.. గుజరాత్‌లోని కేవడియాలో ఐక్యతా ప్రతిమ వద్ద మోడీ నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘నేను కేవడియాలో ఉన్నప్పటికీ, నా ఆలోచనంతా మోర్బీ ఘటన మీదే ఉంది. నేను ఇంతటి బాధను అనుభవించిన సందర్భాలు చాలా అరుదు. ఒకవైపు గుండె అంతా విషాదం నిండి ఉన్నా.. తప్పక నిర్వహించాల్సిన విధులు ఉండటంతో బాధితుల్ని పరామర్శించే అవకాశం దొరకలేదు’’ అని మోడీ పేర్కొన్నారు.
ఈ ఘటన జరిగిన వెంటనే తాను గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ఫోన్‌లో మాట్లాడానని, ఆయన మోర్బీకి చేరుకున్నారని మోడీ తెలిపారు. సహాయక చర్యలను సీఎం దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారన్నారు. సహాయక చర్యల్లో ఎలాంటి అలసత్వం ఉండదని హామీ ఇస్తున్నానని చెప్పిన మోడీ.. ఈ ఘటనకు గల కారణాలను గుర్తించేందుకు ఒక ప్రత్యేక కమిటీని నియమించామన్నారు. ఈ కష్ట సమయాల్లో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, గాయపడినవారికి తక్షణ వైద్యం అందేలా చూస్తున్నామని మోడీ విచారం వ్యక్తం చేశారు. సవాళ్లను ఎదుర్కొంటూనే.. తన పనిని కొనసాగించిన విషయంలో పటేల్ ఆదర్శమని వ్యాఖ్యానించారు. కాగా.. ఈ ఘటనపై నిన్న రాత్రే బాధిత కుటుంబాలకు మోడీ పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే! మృతుల కుటుంబాలకు రూ. రెండు లక్షల చొప్పున, గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందిస్తామని పేర్కొన్నారు.
ఇదిలావుండగా.. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకూ 132 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. మృతుల్లో చాలామంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. 177 మంది ఈ ప్రమాదం నుంచి బయటపడగా.. బృందాలు ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే కొందరు ఈదుకుంటూ, నది ఒడ్డుకు చేరుకున్నారు.