Netanyahu: రెండేళ్లుగా సాగుతున్న గాజా యుద్ధం ముగిసేందుకు మార్గం సుగమం అయింది. ఇజ్రాయిల్-హమాస్ మధ్య ‘‘గాజా శాంతి ఒప్పందం’’ కుదిరింది. గాజా శాంతి ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుదిర్చారు. ఈ నేపథ్యంలో, గురువారం ప్రధాని నరేంద్రమోడీ, ట్రంప్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు కూడా ప్రధాని మోడీ ఫోన్ చేశారు. అయతే, ఆ సమయంలో నెతన్యాహూ గాజా శాంతి ప్రణాళిక, కాల్పుల విరమణ, బందీల విడుదలపై భద్రతా కమిటీలో చర్చిస్తున్నారు. మోడీ ఫోన్ రావడంతో నెతన్యాహూ ఈ అత్యవసరం సమావేశాన్ని నిలిపేసినట్లు ఆయన కార్యాలయం చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ నివేదించింది. ట్రంప్ 20- పాయింట్ల గాజా శాంతి ప్రణాళికపై ప్రధాని మోడీ ఇజ్రాయిల్ ప్రధానిని అభినందించారు. “బందీలందరినీ విడుదల చేయడానికి కుదిరిన ఒప్పందంపై ప్రధాని మోదీ ప్రధాని నెతన్యాహును అభినందించారు” అని నెతన్యాహు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
Read Also: Nobel Peace Prize 2025: పాపం ట్రంప్.. నోబెల్ శాంతి బహుమతి ఎవరికి వచ్చిందో తెలుసా!
ప్రధాని మోడీ, నెతన్యాహూతో మాట్లాడినట్లు ఎక్స్ ద్వారా చెప్పారు. “అధ్యక్షుడు ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక కింద సాధించిన పురోగతిపై అభినందించడానికి నా స్నేహితుడు ప్రధాన మంత్రి నెతన్యాహుకు ఫోన్ చేసాను. బందీల విడుదల, గాజా ప్రజలకు మెరుగైన మానవతా సహాయంపై ఒప్పందాన్ని మేము స్వాగతిస్తున్నాము. ప్రపంచంలో ఎక్కడైనా ఏ రూపంలోనైనా లేదా వ్యక్తీకరణలోనైనా ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదని పునరుద్ఘాటించాము’’ అని ట్వీట్ చేశారు.
ఇదే విషయాన్ని ఇజ్రాయిల్ ప్రధాని కార్యాలయం ఎక్స్ ద్వారా పోస్ట్ చేసింది. ‘‘ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇప్పుడే భారత ప్రధాన మంత్రితో మాట్లాడారు. బందీలందరినీ విడుదల చేయడానికి సాధించిన ఒప్పందంపై నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి నెతన్యాహుకు తన అభినందనలు తెలిపారు’’ అని చెప్పింది.
