Asaduddin Owaisi: జమ్మూ కాశ్మీర్‌లో వరసగా ఉగ్రవాద ఘటనలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉగ్రవాదులు జమ్మూ ప్రాంతంలో రెచ్చిపోతున్నారు. తాజాగా జరిగిన దోడా ఉగ్రఘటనలో నలుగురు జవాన్లు మరణించారు. దీనిపై ప్రతిపక్షాలు బీజేపీపై ఫైర్ అవుతున్నాయి. తాజాగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రధాని మోడీని టార్గెట్‌గా ప్రశ్నించారు. ‘‘ఘర్ మే ఘుస్ కర్ మారేంగే’’ ఉగ్రవాదుల్ని ఇంట్లోకి దూరి చంపేస్తాం అని ప్రధాని మోడీ చెప్పారని, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో జరిగేంటని ప్రశ్నించారు.
వరసగా జరుగుతున్న ఉగ్రఘటనలు ప్రభుత్వం వైఫల్యానికి అద్దం పడుతున్నాయని కేంద్రంపై ఓవైసీ విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ ఉగ్రవాదాన్ని అదుపు చేయలేకపోతున్నారు, దోడాలో జరిగిన ఘటన చాలా ప్రమాదకమైందని ఓవైసీ అన్నారు. సోమవారం సాయంత్రం దోడాలోని దేసా ఫారెస్ట్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో కెప్టెన్ బ్రిజేష్ థాపా, జవాన్లు రాజేష్, బిజేంద్ర, అజయ్‌లు మరణించారు.
Read Also: Pakistan: పాక్ సైనిక స్థావరంపై ఉగ్రదాడి.. 8 మంది భద్రతా సిబ్బంది మృతి..
ఈ ఉగ్రదాడులపై జమ్మూ కాశ్మీర్ డీజీపీ ఆర్ఆర్ స్వైన్ అక్కడి ప్రాంతీయ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక్కడి ప్రాంతీయ పార్టీలు జమ్మూ కాశ్మీర్ పౌరసమాజంలోకి పాకిస్తాన్‌ని చొప్పించాయని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఓవైసీ స్పందిస్తూ, డీజీపీ తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. నియంత్రణ రేఖకు చాలా దూరంలో ఉన్న దోడా ప్రాంతంలోకి ఉగ్రవాదులు ఎలా వచ్చారని, దీనికి బాధ్యులు ఎవరు..? అని ప్రశ్నించారు. 2021 నుండి, జమ్మూలో, 50 మందికి పైగా భద్రతా సిబ్బంది మరియు 19 మంది పౌరులు మరణించారు. ఇటీవల ఆలయానికి వెళ్లిన 10 మంది యాత్రికులు ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురయ్యారని చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది, ఇప్పుడు డీజీపీ ఇలా మాట్లాడుతున్నారు, ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని చెప్పడానికి ప్రయత్నిస్తున్నా..? అని ప్రశ్నించారు.
స్థానికుల్లో మీకు ఎందుకు సాయం చేయడం లేదు..? యువతలో ఎందుకు విశ్వాసంలోకి తీసుకోవడం లేదు..? ఆర్టికల్ 370ని తొలగించామని అంతా అయిపోయిందని అనుకుంటున్నారా.? ఇది నరేంద్రమోడీ ప్రభుత్వ వైఫల్యమని దుయ్యబట్టారు . డీజీపీ అధికార పార్టీకి ప్రతినిధిగా మారాకూడదని, ఆయన ఉద్దేశంలో బీజేపీలో చేరాలని ఘాటుగా స్పందించారు. మరోవైపు, బీజేపీ అధికారంలోకి వచ్చిన 38 రోజుల్లో 9 ఉగ్రవాద ఘటనలు జరిగాయని కాంగ్రెస్ విమర్శించింది.