PM Modi: ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా మొదటిసారిగా ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటించబోతున్నారు. మే 26, 27 తేదీల్లో ఆయన గాంధీనగర్, కచ్, దాహోద్ సహా మూడు జిల్లాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ప్రధాని మోడీ భుజ్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించే అవకాశం ఉంది. ఈ సభకు లక్ష మంది వరకు హాజరవుతారని తెలుస్తోంది. బహిరంగ సభ తర్వాత మోడీ ఆశాపుర ఆలయాన్ని సందర్శిస్తారు.
Read Also: Theatres Closure : థియేటర్లు మూసివేయాలని ఆ నలుగురు నిర్మాతల ఒత్తిడి.. రంగంలోకి ఏపీ మంత్రి
దామోద్‌లో ప్రధాని మోడీ దేశంలో మొట్టమొదటి 9000 హెచ్‌పీ లోకోమోటివ్ ఇంజన్‌ని జాతికి అంకితం చేస్తారు. రూ. 20,000 కోట్ల వ్యయంతో మేకిన్ ఇండియాలో భాగంగా దాహోద్‌లో రైల్వే ఉత్పత్తి యూనిట్‌ని ఏర్పాటు చేశారు. PPP మోడల్‌పై నిర్మించబడిన రైలు కర్మాగారంలో రాబోయే 10 సంవత్సరాలలో దాదాపు 1,200 ఇంజిన్లు తయారు చేయబడతాయి. వీటిని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయనున్నారు. ప్రస్తుతం, ఇక్కడ నాలుగు ఇంజన్లు తయారవుతున్నాయి.
ఈ బాహుబలి లోకోమోటివ్ ఏకంగా 4600 టన్నుల గూడ్స్‌ని మోసుకెళ్లగలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది. మొదటిసారిగా ఈ ఇంజన్‌లో లోక్ పైలెట్ల కోసం ఏసీ, టాయిలెట్ సౌకర్యాన్ని కల్పించారు. ప్రమాదాలను నివారించడానికి ప్రత్యేక వ్యవస్థ కూడా ఈ ఇంజన్‌లో ఉంటుంది. ఈ ప్రాజెక్టు ప్రత్యక్షంగా, పరోక్షంగా 10,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. 9,000 HP 6-యాక్సిల్ ఎలక్ట్రిక్ ఇంజిన్ సగటు వేగం గంటకు 75 కి.మీ. పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్, మహారాష్ట్రలోని పూణేలలో ఉన్న డిపోలలో ఇంజన్ నిర్వహణ జరుగుతుంది.