NTV Telugu Site icon

PM Narandra Modi: టార్గెట్‌ 2024.. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధాని కీలక భేటీ

Pm Narendra Modi

Pm Narendra Modi

PM Narandra Modi: బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ సమావేశమై, కీలక పథకాలను మరింత మెరుగ్గా అమలు చేయాలని సూచించారు. ఆదివారం ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్యమంత్రుల మండలి సమావేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన మొత్తం 12 మంది ముఖ్యమంత్రులు, ఎనిమిది మంది ఉప ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా కూడా పాల్గొన్నారు. గతంలో ఇలాంటి చివరి సమావేశం 2021 డిసెంబర్‌లో వారణాసిలో జరిగింది. ఈ సమావేశంలో, ప్రధాని మోదీ గతిశక్తి, హర్ ఘర్ జల్, స్వామిత్వ, డీబీటీ అమలు, ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్ వంటి కొన్ని కీలక పథకాలు, కార్యక్రమాలను ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మరింత మెరుగ్గా అమలు చేయాలని ఉద్ఘాటించారు.

గ్రామీణ ప్రాంతాల గురించి మాట్లాడుతూ.. గోబర్ధన్ వెబ్ పోర్టల్ ప్రాముఖ్యత, అవసరం గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. పంట ఉత్పాదకతపై నానో-ఎరువుల యొక్క సానుకూల ప్రభావం గురించి ఆయన వివరించారు. వాటి వినియోగాన్ని పెంచడం గురించి మాట్లాడారు. అన్ని కీలక పథకాల సంతృప్త స్థాయి కవరేజీని నిర్ధారించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ దిశగా ముందడుగు వేయాలని అన్నారు. సులభతరమైన వ్యాపారాన్ని పెంపొందించాల్సిన అవసరం గురించి ప్రధాని వివరించారు. ఇందుకోసం ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను ఆయన వివరించారు. దేశంలో వ్యాపార వాతావరణాన్ని మరింత పెంచే దిశగా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని ఆయన ప్రోత్సహించారు.

President Ramnath Kovind: రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ చివరి ప్రసంగం.. ఆయన సందేశమిదే..

తమ రాష్ట్రాలు క్రీడలకు సముచితమైన ప్రాధాన్యతనిచ్చేలా చూడాలని.. యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడానికి, నిమగ్నమయ్యేలా ప్రోత్సహించడానికి అత్యుత్తమ సౌకర్యాలు కల్పించాలని ప్రధానమంత్రులను ప్రధాని మోదీ కోరారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు తమ క్రీడా సంస్కృతిని పెంపొందించుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన ఉద్ఘాటించారు. అన్ని పట్టణాలు, గ్రామాలు, నగరాలు తమ వ్యవస్థాపక దినోత్సవాలను జరుపుకోవడం యొక్క ప్రాముఖ్యత గురించి కూడా ఆయన మాట్లాడారు.ఈ సమావేశంలో ఈ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. ప్రతి పథకం కూడా మారుమూల గ్రామాల వరకు, అర్హులైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అమృత్ సరోవర్ మిషన్ పురోగతి, హర్ ఘర్ తిరంగా ప్రచారానికి సంబంధించిన సన్నాహాలను కూడా సమీక్షించారు. సుపరిపాలన ద్వారా ఆజాదీ కా అమృత్‌కాల్‌ను అంత్యోదయ యుగంగా మార్చేందుకు సీఎంలందరూ కట్టుబడి ఉండాలన్నారు.