President Ramnath Kovind: రాష్ట్రపతి పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా రామ్‌నాథ్ కోవింద్ జాతినుద్దేశించి వీడ్కోలు ప్రసంగం ఇచ్చారు. పౌరులు మహాత్మా గాంధీ జీవితం, బోధనల గురించి ప్రతిరోజూ కనీసం కొన్ని నిమిషాల పాటు ఆలోచించాలని కోరారు. ఉత్తరప్రదేశ్‌లోని పర్వౌంఖ్ గ్రామంలో అతి సాధారణ కుటుంబంలో పుట్టిన తాను భారత రాష్ట్రపతిగా ఎన్నిక కావడం దేశ ప్రజాస్వామ్య పటిష్టతను సూచిస్తోందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. రాష్ట్రపతిగా తన చివరి ప్రసంగంలో ఆయన అనేక సంఘటనలను గుర్తుచేసుకున్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆదర్శాలు ఉన్నతమైనవని.. ఎప్పటికీ అడ్డంకులు కాబోవని పేర్కొన్నారు.
రాష్ట్రపతిగా ఎన్నికయ్యాక తన సొంతూరు పర్వౌంఖ్‌లో తన గురువులు, పెద్దల పాదాలకు నమస్కరించడం తాను ఎప్పటికీ మరచిపోలేని అనుభూతి అని రామ్‌నాథ్ కోవింద్ గుర్తు చేసుకున్నారు. చిన్నారులు, విద్యార్ధులు, యువత భారత సంస్కృతీ సంప్రదాయాలను మరచిపోవద్దన్నారు. నూతన విద్యా విధానం భారత వారసత్వ గొప్పతనాన్ని ప్రస్తుత తరాలకు అందిస్తుందన్న నమ్మకం తనకుందన్నారు. యువతరం తమ పుట్టి పెరిగిన ఊరుతోనూ, గురువులు, పెద్దలతో అనుబంధం కలిగి ఉండాలని రాష్ట్రపతి సూచించారు. భారత్‌లో నాయకత్వానికి ఢోకాలేదన్నారు. అనేక మంది నాయకులు ప్రతితరంలోనూ దేశానికి దిశానిర్దేశం చేస్తున్నారని రామ్‌నాథ్ అభిప్రాయపడ్డారు. జవాన్లు, పారామిలిటరీ, పోలీసులను కలుసుకున్న సందర్భాలు ప్రేరణాదాయకంగా ఉన్నాయని ఆయన చెప్పారు. భవిష్యత్ తరాల కోసం ప్రస్తుత తరాల వారు ప్రకృతిని, భూమాతను, గాలిని, నీటిని కాపాడాలని రామ్‌నాథ్ సూచించారు.
తాను రాష్ట్రపతిగా పనిచేసిన ఈ ఐదేళ్ల కాలంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి పూర్తి సహకారం లభించిందన్నారు. అందరూ తనను ఆశీర్వదించారని తెలిపారు. మూలాలతో అనుబంధం కొనసాగించడం భారతీయ సంప్రదాయం ప్రత్యేకత అని వెల్లడించారు. యువత ఈ సంప్రదాయాన్ని కాపాడుకోవాలి. తమ గ్రామాలు, పట్టణాలు, పాఠశాలలు, ఉపాధ్యాయులతో అనుబంధం కొనసాగించాలని పిలుపునిచ్చారు. .పర్యావరణ సంరక్షణపై ప్రధానంగా మాట్లాడిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. ప్రకృతి ప్రకోపంపై ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ సంక్షోభం భూగ్రహ భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మార్చేస్తోందని అన్నారు. రాబోయే తరాల కోసం పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. చెట్లు, నదులు, సముద్రాలు, పర్వతాలు, తోటి ప్రాణుల సంరక్షణకు పాటుపడాలన్నారు. ఓ ప్రథమ పౌరుడిగా నా దేశప్రజలకు నేనిచ్చే ఏకైక సందేశం ఏదైనా ఉంటే అది ఇదేనని కోవింద్ అన్నారు. సామాజిక ప్రజాస్వామ్యం లేకపోతే రాజకీయ ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వసించారన్నారు. 21వ శతాబ్దాన్ని భారత దేశ శతాబ్దంగా మార్చుకొనేందుకు మన దేశం సన్నద్ధమవుతోందని తాను దృఢంగా విశ్వసిస్తున్నట్టు తెలిపారు.
Minister KTR: కేటీఆర్‌కు నెటిజన్లు సూచించిన సినిమాలేంటో తెలుసా?
భారత నూతన రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము సోమవారం ఉదయం 10.15గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాలులో ప్రమాణస్వీకారం చేయనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నూతన రాష్ట్రపతి ముర్ముతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం ఆమె 21 గన్ సెల్యూట్ స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్, కేంద్రమంత్రులు, ఎంపీలు, గవర్నర్‌లు, సీఎంలు, సైనికాధికారులు పాల్గొంటారు. ప్రమాణస్వీకారం తర్వాత ద్రౌపదీ ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.