ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో 1975లో విధించిన ఎమర్జెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు ప్రయత్నాలు జరిగాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆ చీకటి రోజులను ఎవరూ మరిచిపోకూడదని అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో అన్ని హక్కులను లాక్కున్నారని ఆయన విమర్శించారు. అలాంటి ధిక్కార ఆలోచనలను ప్రజాస్వామ్య మార్గాల ద్వారా ఓడించిన తీరు ప్రపంచంలో మరెక్కడా కనపడదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ‘మన్ కీ బాత్’లో ప్రధాని ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. 1975 జూన్ 25న ఎమర్జెన్సీని విధించిన ఇందిరాగాంధీ దానిని 1977 మార్చి 21న ఎత్తివేశారు.
ఎమర్జెన్సీ సమయంలో అన్ని హక్కులను హరించారని ప్రధాని తెలిపారు. జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛను కాలరాశారని ఆయన అన్నారు. దేశంలోని ప్రజాస్వామ్యం, న్యాయస్థానాలు, మీడియా, రాజ్యాంగ సంస్థలపై ఆంక్షలు విధించారని ఆనాటి సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల మంది పౌరుల అరెస్టులు, లక్షలాది మందిపై దౌర్జన్యాలకు పాల్పడ్డారని తెలిపారు. పత్రికలు ఆనాడు అనుమతి లేకుండా ఏ విషయాన్ని ప్రచురించేందుకు వీలుండేది కాదన్నారు. కానీ ప్రజాస్వామ్యంపై భారతీయులకు ఉన్న విశ్వాసాన్ని మాత్రం సడలించలేకపోయారని ప్రధాని మోదీ అన్నారు. ప్రజాస్వామ్య మార్గాల ద్వారానే ప్రజలు ఎమర్జెన్సీని ఎత్తేసేలా చేశారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో దేశ ప్రజల పోరాటంలో భాగస్వామిని కావడం తన అదృష్టమన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న వేళ మనం ఎమర్జెన్సీ చీకటి రోజుల్ని మరిచిపోకూడదని వ్యాఖ్యానించారు.