Aam Aadmi Party: ప్రధాని నరేంద్రమోదీని టార్గెట్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో ఆప్ వర్సెస్ బీజేపీగా రాజకీయ పోరాటం కొనసాగుతోంది. ద్వేషాన్ని ఆపడానికి, విధానాలు రూపొందించడానికి, ఈ దేశ వ్యవస్థాపకుల కలలను సాకారం చేయడానికి భారతదేశానికి విద్యావంతులైన ప్రధాని అవసరమని ఆప్ ఈ రోజు శ్రీనగర్ లో వ్యాఖ్యానించింది. ‘‘మోదీ హఠావో – దేశ్ బచావో’’ప్రచారాన్ని ప్రారంభించింది ఆప్. ఆ పార్టీ మీడియా కోఆర్డినేటర్ కమిటీ చైర్మన్ నవాబ్ నాసిర్ అమన్ మాట్లాడుతూ.. నిరక్షరాస్యుడు దేశాన్ని నడపలేదని అన్నాడు.
Read Also: Harish Rao : బీజేపీ పాలనలో అచ్చే దిన్ కాదు.. సామాన్యుడు సచ్చే దిన్
ప్రధాని నరేంద్రమోది నిరక్షరాస్యుడు అని, ఈ దేశానికి విద్యావంతులు ప్రధానిగా ఉండాలని, దేశంలో ద్వేషాన్ని అరికట్టాలని అన్నాడు. పార్టీ విమర్శలను ఎదుర్కొంటోందని, తమను జైళ్లకు కూడా పంపవచ్చని, కానీ నిజాలు చెప్పడం ఆపేయం అని అమన్ అన్నాడు. దేశాన్ని రక్షించాలంటే సర్దార్ వల్లభాయ్ పటేల్, మహత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ కలలను సాకారం చేయాంటే నరేంద్రమోదీని గద్దె దించాలని ప్రజలకు సూచించారు. ప్రధాని మోదీ కోర్టులను, ఈడీ, ఎన్నికల కమిషన్ వంటి కేంద్ర సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ విమర్శించారు. మనం స్వాతంత్య్రం కోసం కొత్త పోరాటం చేయాలని ఆప్ పేర్కొంది.
ప్రతీ ముస్లిం, హిందువు, సిక్కు మంచి విద్య, వైద్యం, శాంతిని పొందాలని కోరుకుంటున్నారని, కానీ నేడు ఈ ప్రభుత్వం బీజేపేతర పార్టీలను ముఖ్యమంత్రులకు ఈడీ సమన్లు జారీ చేస్తుందని, ప్రతిపక్షాలపై దాడులు చేస్తుందని, కానీ వారు బీజేపీలో చేరినప్పుడు మాత్రం ఎలాంటి ఆరోపణలు ఉండవని ఆప్ నేత విమర్శించారు. ప్రభుత్వం కేవలం కొందరు వ్యాపారుల కోసమే పనిచేస్తుందని ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు అన్నీ బాగానే ఉంటే ఎందుకు ఎన్నికలు నిర్వహించడం లేదని ప్రశ్నించారు.