PM Modi: ప్రధాని నరేంద్రమోడీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో శనివారం పర్యటించారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించిన తీరును కొనియాడారు. పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రస్థావరాలపై మే 7న భారత్ తీవ్రదాడి చేసింది. ఈ దాడిలో స్వదేశీ ఆయుధాల సామర్థ్యాన్ని ప్రపంచం మొత్తం చూసిందని ప్రధాని మోడీ శనివారం అన్నారు. భారతదేశ వైమానిక రక్షణ వ్యవస్థలు, క్షిపణులు, డ్రోన్లు ‘ఆత్మనిర్భర్ భారత్’ (స్వావలంబన భారతదేశం) బలాన్ని నిరూపించాయని ప్రధాని మోదీ చెప్పారు.
Read Also: Car Sales Slow Down: ట్రంప్ సుంకాల ప్రభావం.. కార్లు కొనడానికి భయపడుతున్న జనం..!
బ్రహ్మోస్ క్షిపణులు భారతదేశ శత్రువుల్లో భయాన్ని రేకెత్తించాయి అని ఆయన అన్నారు. ‘‘బ్రహ్మోస్ క్షిపణి శబ్ధం వింటే పాకిస్తాన్ నిద్రపోదు’’ అని ప్రధాని అన్నారు. లక్నోలో కొత్తగా ప్రారంభించిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంటిగ్రేషన్, టెస్టింగ్ ఫెసిలిటీ గురించి ప్రస్తావిస్తూ, ఈ క్షిపణులు ఉత్తర ప్రదేశ్‌లో తయారు చేయడం పట్ల తాను సంతోషంగా ఉన్నానని ప్రధాని అన్నారు. పాకిస్తాన్ మళ్లీ ఏదైనా పాపం చేస్తే యూపీలో తయారైన క్షిపణులు ఇప్పుడు ఉగ్రవాదులను నాశనం చేస్తాయని అన్నారు.
ఆపరేషన్ సిందూర్‌ని డ్రామాగా విమర్శించిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్‌పై ప్రధాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాకిస్తాన్ బాధ పడితే ఈ రెండు పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మన సైన్యాన్ని నిరంతరం అవమానిస్తోందని ఆరోపించారు. ప్రత్యేక రోజునే పహల్గామ్ ఉగ్రవాదుల్ని ఎందుకు చంపారని ఎస్పీ ప్రశ్నిస్తోందని, వారికి చెప్పి చేయాలా..? అని మోడీ ప్రశ్నించారు. 26 మంది పౌరులను చంపిన పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటానని ఇచ్చిన హామీని శివుని ఆశీస్సులతో నెరవేర్చామని ప్రధాని మోదీ అన్నారు.