ఇండిగో ఎయిర్‌లైన్ సంక్షోభం దేశ సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ స్పందించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులకు జరిగిన నష్టాలపై జోక్యం చేసుకోవాలని.. చీఫ్ జస్టిస్ స్వయంగా విచారణ చేపట్టాలని కోరారు. పౌర విమానయాన శాఖ, డీజీసీఏలు స్టేటస్ నివేదికలు సమర్పించేలా ఆదేశించాలని… తక్షణ విచారణ కోసం ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు. దేశ వ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టుల్లో సంక్షోభం నెలకొనడంతో శనివారం విచారించే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Shashi Tharoor: పుతిన్ విందుకు రాహుల్, ఖర్గేలకు ఆహ్వానం లేదు.. శశి థరూర్‌కి మాత్రం స్పెషల్ ఇన్విటేషన్..
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. ఇంకా విమాన సర్వీసులు పునరుద్ధరించబడలేదు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాత్రం సేవలు పునరుద్ధరించినట్లుగా ఇండిగో సంస్థ ఎక్స్‌లో పేర్కొంది. మిగతా ఏ ఎయిర్‌పోర్టుల్లోనూ సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి: Trump: ఎట్టకేలకు ట్రంప్‌కు అవార్డు.. ‘ఫిఫా శాంతి బహుమతి’ ప్రకటన
ఇదిలా ఉంటే ఇండిగో సంక్షోభంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. సంక్షోభం సృష్టించిన ఇండిగోపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రేపటి నుంచి ప్రయాణికులకు సమస్యలు సృష్టించడం ఆపేయాలని వార్నింగ్ ఇచ్చారు. నవంబర్ 1 నుంచి కొత్త విమాన డ్యూటీ నిబంధనలు అమల్లోకి వచ్చినా.. మిగతా విమానయాన సంస్థలు ఎటువంటి సమస్యలు ఎదుర్కోలేదని.. అలాంటిది ఇండిగోకే ఎందుకు ఎదురవుతాయని ప్రశ్నించారు. అంటే ఇది ఇండిగో సృష్టించిన సంక్షోభం అని స్పష్టం చేశారు. పరిస్థితులు మెరుగుపడతాయని.. రేపటి నుంచి కార్యకలాపాలు పున:ప్రారంభం అవుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పరిస్థితుల్ని సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇండిగో అంతరాయాలను విచారించడానికి, తప్పు చేసిన వ్యక్తులను గుర్తించడానికి ఒక కమిటీ వేస్తామని వెల్లడించారు. అనంతరం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం FDTL మార్గదర్శకాలు ప్రధాన కారణమని చెబుతున్నారని.. కానీ ఇతర విమానయాన సంస్థలు కూడా (నిబంధనలు) పాటిస్తున్నాయని.. వారికి ఎటువంటి సమస్య లేదని రామ్మోహన్ నాయుడు అన్నారు.
మరోవైపు విమాన ప్రయాణికులు పడుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా 114 అదనపు ట్రిప్పులను నడుపుతోంది. అంతేకాకుండా 37 రైళ్లకు 116 అదనపు కోచ్‌లను ఏర్పాటు చేసింది. సబర్మతి-ఢిల్లీ మధ్య ప్రత్యేక రైలు నడుస్తుందని ప్రకటించింది. అదనపు కోచ్‌లు, ప్రత్యేక రైళ్లు ఏర్పాట్లు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.