Marriage: సాధారణంగా పెళ్లి ఎక్కడ చేసుకుంటారు.. కొందరు ఇంటి దగ్గర చేసుకుంటారు.. మరికొందరు ఫంక్షన్ హాల్‌లో చేసుకొంటారు.. ఇంకొందరు గుళ్లల్లో చేసుకుంటారు. ఎక్కడ చేసుకున్నా అది పెళ్లే. కానీ కొందరికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయ.. ఫలానా దగ్గరనే చేసుకోవాలి.. ఫలానా దగ్గర చేసుకుంటే బాగుంటుందనే నమ్మకం ఉంటుంది. అలాంటి నమ్మకంతోనే ఇప్పుడు చాలా మంది తమ పెళ్లిని శివపార్వతుల పెళ్లి జరిగిందనే గుళ్లో చేసుకోవడానికి తహతహలాడుతున్నారు. అది ఎక్కడ.. ఎందుకు అలా అనుకుంటున్నారో చూడండి..
Read also: Anil Kumar Yadav: భయమనేది నా రక్తంలోనే లేదు.. యుద్ధానికైనా వస్తా
పెళ్లి అంటే నూరేళ్ల పంట. అనేక కుటుంబాల మధ్య బంధుత్వంతోపాటు ఆత్మీయతానుబంధాలు పెనవేసుకోవడానికి నాందీవాచకం. అందుకే ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా, బంధుమిత్రుల సమక్షంలో జరుపుకుంటారు. కొందరు పవిత్ర పుణ్య క్షేత్రాల్లో తమ వివాహం జరుపుకుంటారు. ఇక ఆది దంపతులు శివపార్వతులు పెళ్లి చేసుకున్న చోటులోనే పెళ్లి చేసుకుంటే తమ జీవితాలు ఎంతో సౌభాగ్యవంతంగా సాగుతాయనే నమ్మకం చాలా మందికి ఉంటుంది. అందుకే ఉత్తరాఖండ్‌లోని త్రియుగి గ్రామానికి కొత్త జంటలు పోటెత్తుతున్నాయి. ఇక్కడి త్రియుగినారాయణ్ దేవాలయంలో పెళ్లి చేసుకుని పవిత్ర భావాన్ని, సంతోషాన్ని మూటగట్టుకుని వెళ్తున్నారు. బదరీ కేదార్ దేవాలయం కమిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యోగేంద్ర సింగ్ మాట్లాడుతూ, కొత్త జంటలు త్రియుగినారాయణ్ దేవాలయానికి వచ్చి పెళ్లి చేసుకుంటున్నారని చెప్పారు. పెళ్లి వేడుకల నిర్వహణకు అవసరమైన సదుపాయాలను కల్పించడం కోసం త్వరలోనే ఓ ప్రణాళికను రూపొందిస్తామని చెప్పారు. ఉత్తరాఖండ్ తీర్థ్‌పురోహిత్ సమితి కార్యదర్శి సర్వేశ్వానంద్ సేమ్వాల్ మాట్లాడుతూ, ఈ ఏడాది మకర సంక్రాంతి నుంచి ఇప్పటి వరకు 50కిపైగా వివాహాలు ఇక్కడ జరిగాయని చెప్పారు. మే-జూన్ నెలల్లో 30 వివాహాలు జరిగాయని చెప్పారు. 2022లో 85 పెళ్లిళ్లు జరిగాయన్నారు. ఇక్కడ పెళ్లి చేసుకోవడం కోసం కొత్త జంటలు 2024 మార్చి వరకు బుక్ చేసుకున్నారని చెప్పారు.
Read also: Bandi Sanjay: మీ అందరికి అభినందనలు.. బండి ట్విట్ వైరల్
సత్యయుగంలో శివపార్వతులు అగ్ని సాక్షిగా త్రియుగి నారాయణ్‌లోనే పెళ్లి చేసుకున్నారని సేమ్వాల్ చెప్పారు. ఇక్కడి యజ్ఞ కుండంలో అగ్ని ఇప్పటికీ ప్రజ్వరిల్లుతోందని.. ఇది శాశ్వతంగా ఉంటుందని చెప్పారు. భక్తులు ఇక్కడికి వచ్చి యజ్ఞ కుండంలోని విబూదిని తీసుకెళ్తారని చెప్పారు. ఈ విబూదిని ధరిస్తే వైవాహిక జీవితం మరింత సంతోషంగా గడుస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ నుంచి 250 కిలోమీటర్ల దూరంలో రుద్ర ప్రయాగ్ జిల్లాలో త్రియుగి గ్రామంలో త్రియుగినారాయణ్ దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో ప్రాచీన కాలంనాటి నీటి మడుగులు ఉన్నాయి.