మహారాష్ట్ర స్థానిక ఎన్నికల సమయంలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. స్థానిక ఎన్నికల కోసం శరద్ పవార్-అజిత్ పవార్ కుటుంబాలు మళ్లీ ఏకమయ్యాయి. ముంబై, పింప్రి-చించ్‌వాడ్, పూణె సహా మహారాష్ట్ర అంతటా 29 మునిసిపల్ కార్పొరేషన్లకు జనవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 16న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక డిసెంబర్ 30న నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ. ఈ నేపథ్యంలో పింప్రి-చించ్‌వాడ్‌లో కలిసి పోటీ చేయాలని శరద్ పవార్-అజిత్ పవార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇద్దరూ చేతులు కలిపారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ వెల్లడించారు. ఈ కొత్త కూటమికి తన బాబాయ్ శరద్ పవార్ నాయకత్వం వహిస్తారని తెలిపారు.
ఇది కూడా చదవండి: CM Revanth ShakeHands KCR: అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం.. కేసీఆర్కి షేక్హ్యాండ్ ఇచ్చిన సీఎం రేవంత్
మొత్తానికి పవార్ కుటుంబంలో నెలకొన్న విభేదాలు.. తిరిగి స్థానిక ఎన్నికల రూపంలో మళ్లీ కలిపింది. ప్రస్తుతం పింప్రి-చించ్‌వాడ్‌లో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పూణె మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం కలిసి పోటీ చేసే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం పొత్తులపై చర్చలు జరుపుతున్నారు.
ఇది కూడా చదవండి: China-Taiwan: చైనా-తైవాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు.. డ్రాగన్ దళాలు భారీ విన్యాసాలు
ఇదిలా ఉంటే ముంబై మున్సిపల్ ఎన్నికల కోసం శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎస్) అధ్యక్షుడు రాజ్ థాక్రే ఇప్పటికే ఒక్కటయ్యారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నట్లు గత వారం సంయుక్తంగా ప్రకటించారు. బీఎంసీ మేయర్ పీఠం తమదేనని వెల్లడించారు. ఈ కుటుంబాల కలయిక మహారాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పు తీసుకువస్తుందనే సర్వత్రా ఆసక్తి నెలకొంది.
