Congress: ప్రభుత్వ మార్పు, రెజిమ్ చేంజ్ అనేది ప్రతిపక్షాల ఉద్దేశమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ స్పందించింది. ఆ పార్టీ నేత పవన్ ఖేరా మాట్లాడుతూ.. ఎన్నికల ద్వారా ప్రభుత్వాన్ని మార్చాలని కోరుకోవడంలో తప్పేమీ లేదని అన్నారు. ఎన్నికల సంఘం పనితీరు, SIR ప్రక్రియ, ఎన్డీయే కూటమి ఐక్యతపై ఆయన ప్రశ్నల్ని లేవనెత్తారు. ‘‘ఓట్ చోర్ గద్దీ ఛోడ్’’ పేరుతో తాము ప్రచారం నిర్వహిస్తున్నామని, ప్రస్తుత ప్రభుత్వాన్ని ఓడించి పాలనను మార్చాలనే ఉద్దేశాన్ని బహిరంగంగా చెబుతున్నామని ఖేరా అన్నారు. ఎన్నికల ద్వారా అధికార మార్పును కోరుకోవడంపై అభ్యంతరం తెలిపే వారు రాజ్యాంగ స్పూర్తిని ప్రశ్నిస్తున్నట్లే అని అన్నారు.
బీహార్, పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు లక్షలాది మంది ఓటర్లను ఓటు హక్కు వినియోగించుకోకుండా చేశారని ఆరోపించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన సీఎం చంద్రబాబు నాయుడు, ఏక్నాథ్ షిండే, జేడీయూ వంటి మిత్ర పక్షాలు ఇంకెంత కాలం బీజేపీకి మద్దతు ఇస్తాయని ప్రశ్నించారు. ప్రభుత్వ మార్పు కోసం ఇండీ కూటమి తన మిత్రపక్షాలతో సంప్రదింపులు జరుపుతోందని అన్నారు. తాము అమిత్ షాకు భయపడేది లేదని, మీ సమయం ముగిసిందని అన్నారు.

