LoC Ceasefire: భారత్- పాకిస్థాన్ నియంత్రణ రేఖ (LoC) వెంబడి మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆపరేషన్ సింధూర్ అనంతరం తొలిసారిగా పాకిస్థాన్ సైన్యం భారీగా కాల్పులకు పాల్పడగా, భారత సైన్యం ధీటుగా ప్రతిస్పందించింది. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లా తర్కుండి సెక్టార్‌లో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నివేదికల ప్రకారం, శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో పాకిస్థాన్ సైన్యం నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు ప్రారంభించింది. ప్రారంభంలో భారత సైన్యం దీనిని రెచ్చగొట్టే చర్యగా భావించి సంయమనం పాటించింది. అయితే కాల్పులు తీవ్రతరం కావడంతో భారత జవాన్లు గట్టిగా ప్రతిస్పందించారు. రెండు దేశాల సైన్యాల మధ్య జరిగిన ఈ ఫైర్ ఎక్స్చేంజ్ రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగినట్లు సమాచారం.
దృష్టి మళ్లించే ప్రయత్నమా?
భద్రతా వర్గాల అంచనా ప్రకారం, పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoJK)లో నెలకొన్న పరిస్థితుల నుంచి జాతీయ, అంతర్జాతీయ దృష్టిని మళ్లించేందుకు పాకిస్థాన్ సైన్యం ఈ కాల్పులకు పాల్పడినట్లు భావిస్తున్నారు.
అప్రమత్తమైన భారత సైన్యం
సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితిని భారత సైన్యం నిశితంగా పర్యవేక్షిస్తోంది. గతంలో కూడా పాకిస్థాన్ వైపు నుంచి పలుమార్లు చొరబాటు ప్రయత్నాలు జరిగినప్పటికీ, భారత భద్రతా బలగాలు వాటిని విజయవంతంగా తిప్పికొట్టాయి. తాజా కాల్పుల నేపథ్యంలో నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం అప్రమత్తతను మరింత పెంచింది. సరిహద్దు ప్రాంతాల్లో అదనపు నిఘా, భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది.
ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలి ఘటన
గత ఏడాది నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ అనంతరం నియంత్రణ రేఖ వెంబడి ఈ స్థాయిలో భారీ కాల్పులు జరగడం ఇదే తొలిసారి. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, ఈ ఘటనలో ప్రాణనష్టం లేదా గాయాలపై ఇప్పటివరకు అధికారిక సమాచారం వెలువడలేదు. పరిస్థితిని భద్రతా దళాలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి.

