Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..

  • భారత విమానాలపై పాక్ నిషేధం పొడగింపు..
  • ఆగస్టు 23 వరకు ఎయిర్ స్పేస్ క్లోజ్..
  • NOTAM జారీ చేసిన పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ.
  • పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పరస్పర ఎయిర్‌స్పేస్ ఆంక్షలు అమల్లోనే.
India Pak

India Pak

Pakistan: భారత విమానాలకు, సైనిక విమానాలకు విధించిన గగనతల ఆంక్షల్ని పాకిస్తాన్ మరోసారి పొడగించింది. తాజా నిర్ణయం ప్రకారం, భారత రిజిస్ట్రేషన్ కలిగిన విమానాలు, భారత ఎయిర్‌లైన్స్ నిర్వహించే లేదా లీజుకు తీసుకున్న విమానాలు, సైనిక విమానాలకు పాకిస్థాన్ గగనతలం ఆగస్టు 23 రాత్రి 11.59 గంటల వరకు అందుబాటులో ఉండదు. ఈ మేరకు పాకిస్తాన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ నోటీస్ టు ఎయిర్‌మెన్ (NOTAM) జారీ చేసింది. గతంలో ఉన్న ఆంక్షలు జూలై 24తో ముగియాల్సి ఉండగా, దానిని మరోసారి పాకిస్తాన్ పొడగించింది.

2025 ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ దాడి అనంతరం భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించి పాక్, పీఓకేలో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. వందలాది మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. దీని తర్వాత పాకిస్తాన్ సైన్యం భారత్‌పై దాడికి ప్రయత్నించింది. దీనికి ప్రతిగా భారత్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన పలు కీలక వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. క్షిపణులు నూర్ ఖాన్ వంటి కీలక పాక్ ఎయిర్ బేసుల్ని ధ్వంసం చేసింది.

దీని తర్వాత పాకిస్తాన్, భారత్‌లు ఒకరిపై ఒకరు గగనతల ఆంక్షలు విధించుకున్నాయి. పాకిస్తాన్ తరహాలోనే పాక్ ఎయిర్ లైన్స్ నడుపుతున్న విమానాలు, సైనిక విమానాలకు భారత్ తన గగనతలాన్ని మూసేసింది. పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసేయడం వల్ల భారత విమానాలు అరేబియా సముద్రం మీదుగా తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీని వల్ల అదనపు సమయం, అదనపు ఖర్చులు పెరుగుతున్నాయి. ప్రయాణికులపై ఈ భారం పడుతోంది.