Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి యావత్ దేశాన్ని షాక్‌కి గురిచేసింది. కాశ్మీర్ అందాలు చూసేందుకు వచ్చిన టూరిస్టుల్ని టార్గెట్ చేసి ఉగ్రవాదులు కాల్చి చంపారు. ప్రస్తుతం వస్తున్న వివరాల ప్రకారం, 27 మంది వరకు టూరిస్టులు ఈ దాడిలో మరణించినట్లు సమాచారం. మృతుల్లో ఇజ్రాయిల్, ఇటలీ దేశస్థులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిని ప్రధాని మోడీ సహా హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు.
అయితే, ఈ దాడికి పాల్పడినట్లు లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ బాధ్యత ప్రకటించుకుంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ జమ్మూ కాశ్మీర్ గురించి కామెంట్స్ చేసిన కొన్ని రోజులకే ఈ దారుణమైన ఉగ్రదాడి జరగడం పాక్ ప్రమేయాన్ని సూచిస్తోంది. గత వారం ఆసిమ్ మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ‘‘కాశ్మీర్ సోదరులను మేం వదిలేయమని, వాళ్లకోసం నిరంతరం పోరాడుతూ ఉంటాము. కాశ్మీర్ మా జీవనాడి’’ అని అన్నారు. పరోక్షంగా ఉగ్రవాదానికి మద్దతు ఇస్తామని చెప్పకనే చెప్పారు
Read Also: Terror Attack: ఉగ్రదాడిలో 27 మంది మృతి?.. మరణించిన వారిలో ఇజ్రాయెల్, ఇటాలియన్ టూరిస్టులు!
కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్‌లో సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్లా వంటి ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తోంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో సరిహద్దు వెంబడి ఉగ్రతండాలను నిర్వహిస్తోంది. తాజాగా, ఆసిమ్ మునీర్ వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులకే, పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది. ప్రస్తుతం, జమ్మూ కాశ్మీర్‌లో స్థానిక ఉగ్రవాదులు తగ్గారు. ఆ ప్రాంతంలో 70 మంది వరకు విదేశీ ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. వీరంతా పాకిస్తాన్ నుంచి బోర్డర్ దాడి, అడవులు, కొండల మాటున కాశ్మీర్‌లోకి వచ్చారు. అదును చూసి ఈ రోజు టూరిస్టుల్ని టార్గెట్ చేశారు.
గత కొంత కాలంగా టెర్రరిస్టులు టార్గెటెడ్ దాడులకు, ఆర్మీపై దాడులకు పరిమితమయ్యారు. స్థానికేతరులను చంపడం, ఆర్మీ వాహనాపై దాడులు చేస్తున్నారు. చాలా కాలం తర్వాత ఇలా టూరిస్టులను టార్గెట్ చేయడం ఇదే తొలిసారి. పక్కా ప్లాన్‌తో ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు ప్రజల్ని మభ్య పెట్టారు. టూరిస్టుల్ని చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ దాడిపై సమాచారం అందిన వెంటనే హోంమంత్రి సంఘటన స్థలానికి బయలుదేరారు. ఈ దాడిపై ఎన్ఐఏ విచారణ ప్రారంభించింది. నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఎంపీ సుచేంద్ర కుమార్ ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయలుదేరారు.
