Pakistan: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య ఘర్షణతో అట్టుడికిపోతోంది. గత 24 గంటల్లో 18 మంది భద్రతా సిబ్బంది, 23 మంది ఉగ్రవాదులు మరణించారు. ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం పరిణామాలను సమీక్షించేందుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ బలూచిస్తాన్ వెళ్లారు. పాకిస్తాన్ మిలిటరీ మీడియా విభాగమైన ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) ప్రకారం, బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫ్రాజ్ బుగ్టి మరియు గవర్నర్ షేక్ జాఫర్ ఖాన్ మండోఖైల్ తో కలిసి సైనికుల అంత్యక్రియలలో ప్రార్థనలు చేశారు. క్వెట్టా మిలిటరీ ఆస్పత్రితో గాయపడి చికిత్స పొందుతున్న సైనికులను పరామర్శించారు.
Read Also: Priyanka Gandhi : కేజ్రీవాల్ తో పొత్తుపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రియాంక గాంధీ
బలూచిస్తాన్ ప్రజల భద్రత, శ్రేయస్సుని నిర్ధారించడంలో సైన్యం తన దృఢ సంకల్పాన్ని ఆయన కొనియాడారు. గత 24 గంటల్లో సమస్యాత్మక బలూచిస్తాన్‌లోని వివిధ ప్రాంతాలలో ఉగ్రవాదులు మరణించారని సైన్యం తెలిపింది. శనివారం హర్నాయ్ జిల్లాలో జరిగిన ఒక ఆపరేషన్‌లో, పాక్ సైన్యానికి ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. 11 మంది ఉగ్రవాదుల్ని హతమార్చి, వారి స్థావరాలను నాశనం చేసినట్లు పాక్ ఆర్మీ తెలిపింది. శుక్రవారం రాత్రి ప్రారంభంలో, కలత్‌లోని మాంగోచర్ ప్రాంతంలో రోడ్డు దిగ్బంధాలను ఏర్పాటు చేయడానికి ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని భద్రతా దళాలు అడ్డుకున్నాయి. ఈ ఘర్షణల్లో 12 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. “గత 24 గంటల్లో బలూచిస్తాన్‌లో వివిధ ఆపరేషన్లలో మొత్తం 23 మంది ఉగ్రవాదులను నరకానికి పంపారు” అని సైన్యం తెలిపింది. అయితే, ఈ దాడులకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యత వహించలేదు.
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులు గత కొంత కాలంగా ఉగ్రవాద దాడులతో హింసను చూస్తున్నాయి. బలూచిస్తాన్ ప్రాంత విముక్తి కోసం ‘‘బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)’’ గత కొంత కాలంగా పోరాడుతోంది. ముఖ్యంగా పాక్ సైనికులు, అధికారుల్ని టార్గెట్ చేస్తోంది. పాక్‌లో అతిపెద్ద ప్రావిన్సుగా ఉన్న బలూచిస్తాన్ నుంచే చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) వెళ్తోంది. ఈ ప్రాంతంలోనే చైనా తన వ్యూహాత్మక పోర్టు గ్వాదర్‌ని నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టుని కూడా బీఎల్ఏ టార్గెట్ చేస్తోంది. ఇక ఖైబర్ ప్రాంతంలో పాక్ తాలిబాన్లు ప్రభుత్వానికి చుకర్కలు చూపిస్తున్నారు. గత ఏడాది కాలంలో పాక్ వ్యాప్తంగా 444 ఉగ్రదాడులు జరిగాయి. ఇందులో 685 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.