కరోనా పాజిటివ్ కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి.. అయితే, కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో.. క్రమంగా అన్ని రాష్ట్రాల్లో స్కూళ్లు, విద్యా సంస్థలు అన్ని ఓపెన్ చేశారు.. కానీ, ఇప్పుడు విద్యార్థులు, ఉపాధ్యాయులు అక్కడక్కడ కరోనా బారినపడడం కలవరానికి గురిచేస్తోంది.. మరో విషయం ఏటంటే.. హిమాచల్‌ప్రదేశ్‌లో నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా 550 మందికిపైగా విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య అధికారి వెల్లడించారు.. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 25 వరకు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు కోవిడ్ బారినపడ్డారని.. అత్యధికంగా హమీర్పూర్ జిల్లాలో 196 మంది, కంగ్రాలో 173, ఉనాలో 104, మండిలో 26, షిమ్లాలో 22, కిన్నౌర్‌లో 14తో పాటు పలు జిల్లాల్లో విద్యార్థులకు పాజిటివ్‌గా తేలినట్టు అధికారులు ప్రకటించారు.. వీరిలో ఇప్పటి వరకు 305 మంది కోలుకోగా.. మరో 250 మందిలో వైరస్ ఉన్నట్టు తెలిపారు.. ఇక, హిమాచల్‌ప్రదేశ్ ఆరోగ్యశాఖ తాజా బులెటిన్ ప్రకారం.. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 1,415 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇందులో ఆరో వంతు కంటే ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారని ప్రభుత్వం పేర్కొంది.