Temple Lamp Row: తమిళనాడులో ‘‘తిరుప్పరకుండ్రం’’లోని ‘‘సుబ్రమణ్య స్వామి ఆలయం వివాదానికి కేంద్రంగా మారింది. ఈ వివాదంపై ఆలయం వద్ద ‘‘దీపం’’ వెలిగించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించారు. అయితే, ఈ తీర్పు డీఎంకే దాని మిత్ర పక్షాలైన కాంగ్రెస్, సమాజ్‌వాదీ, ఇతర ఇండీ కూటమి పార్టీలకు నచ్చడం లేదు. ఈ నేపథ్యంలో తీర్పు చెప్పిన న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్‌పై ‘‘అభిశంసన’’ ప్రవేశపెట్టడానికి ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో సహా 120 మందికిపైగా ప్రతిపక్ష ఎంపీలు అభిశంసన ప్రతిపాధనను సమర్పించాయి.
తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలోనే కార్తికేయ స్వామి ‘‘దీపం’’ వివాదంతో న్యాయమూర్తిని తొలగించాలని ‘‘అభిశంసన’’ తీర్మానాన్ని ప్రతిపక్ష ఎంపీలు మంగళవారం మధ్యాహ్నం స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ప్రతిపక్ష ఇండీ కూటమి మిత్రపక్షాలు న్యాయమూర్తిని తొలగించాలని ప్రయత్నిస్తున్నాయి.
Read Also: IPL 2026 Auction: 35 కొత్త పేర్లు.. 350 మంది ప్లేయర్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
వివాదం ఏంటి.?
తిరుప్పరకుండ్రం సుబ్రమణ్యస్వామి ఆలయం కేసం తమిళనాడులో ఇటీవల చర్చనీయాంశంగా మారింది. మధురైలోని ఒక కొండపై దీపం వెలిగించే ఆచారం ‘‘దీపథాన్’’గా పిలువబడే స్తంభాల్లో ఒకదానిపై దీపం వెలిగించడం చుట్టు తిరుగుతోంది. సోమవారం, ఈ అంశంపై విచారణ సందర్భంగా జస్టిస్ స్వామినాథన్ రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల నిరసనల్ని తోసిపుచ్చారు. 100 ఏళ్లకు పైగా సంప్రదాయంగా వస్తున్న కొండ పాదాల వద్ద ఉన్న స్తంభానికి బదులుగా కొండపై నిర్మించిన స్తంభంపై దీపం వెలిగించాలని ఆదేశించారు. పైన ఉన్న స్తంభం కూడా ఆలయ ఆస్తి అని, దానిని కూడా ఆచారంలో చేర్చాలని న్యాయమూర్తి వాదించారు. ఈ కొండపై 6వ శతాబ్ధానికి చెందిన సుబ్రమణ్య స్వామి ఆలయంతో పాటు 14వ శతాబ్ధానికి చెందిన దర్గా ఉంది. ఇదే ఇక్కడ రాజకీయాలకు కారణమైంది.
డీఎంకే వాదన ఏంటి?
అయితే, ఇలాంటి ఉత్తర్వులు మతపరమైన ఉద్రిక్తతల్ని రేకిత్తించగలవని, ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు మరో ఆరు నెలలు ఉన్న సమయంలో ఇలాంటి తీర్పుపై డీఎంకే ఆందోళన వ్యక్తం చేసింది. జస్టిస్ స్వామినాథన్ తీర్పు మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన 2017 తీర్పును తుంగలోకి తొక్కుతుందని డీఎంకే చెబుతోంది.
అయితే, కోర్టు అసలు తీర్పును పాటించకుండా, డిసెంబర్ 3 పండగ రోజు దిగువ స్తంభంపై సాంప్రదాయకంగా ఉండే ప్రదేశంలో దీపం వెలిగించారు. అయితే, తన ఉత్తర్వులు పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి, మరోసారి కొండపై ఉన్న స్తంభంపై దీపం వెలిగించాలని మరోసారి ఆదేశాలు ఇచ్చారు. ప్రజలు పెద్ద సంఖ్యలో కొండపైకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు చెలరేగాయి. కేంద్ర బలగాలను పంపడంపై కూడా రాష్ట్రప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై డీఎంకే డిసెంబర్ 04న హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. కానీ రాష్ట్రం చేస్తున్న వాదనల్ని కోర్టు అంగీకరించలేదు. దీంతో డీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇది విచారణకు రావాల్సి ఉంది.