Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై రక్షణ శాఖ చీఫ్, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ ‘‘ఇప్పటికీ కొనసాగుతోంది’’ అని శుక్రవారం చెప్పారు. దేశ సైనిక సంసిద్ధత హై అలర్ట్‌లో ఉందని, 24 గంటలూ, ఏడాది పొడవునా ఉంటుందని చెప్పారు. ఢిల్లీలోని సుబ్రతో పార్క్‌లో జరిగిన రక్షణ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ.. సైన్యానికి ఇన్ఫర్మేషన్ వారియర్స్, టెక్నాలజీ వారియర్స్, నిపుణులు కూడా అవసరమని చెప్పారు. భవిష్యత్తులో సైనికులకు ఈ మూడింటిపై పట్టు ఉండాలని అన్నారు.
యుద్ధంలో రన్నరప్‌లు లేరని, ఏ సైన్యం అయినా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, హై లెవల్ ఆపరేషనల్ సంసిద్ధతకు కొనసాగించాలని సీడీఎస్ అన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, మే 7న భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించింది. పీఓకే, పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో 100కు పైగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడులకు ప్రతిస్పందగా పాకిస్తాన్ చేసిన దాడుల్ని భారత్ తిప్పికొట్టింది. పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన 11 ఎయిర్ బేసుల్ని భారత్ సైన్యం నాశనం చేసింది.