Site icon NTV Telugu

Operation Sindoor: సరిహద్దులు మూసివేత, సిద్ధంగా మిస్సైల్స్, ‘‘షూట్ అట్ సైట్’’ ఆర్డర్స్.. బోర్డర్‌లో హై అలర్ట్..

Op Sindoor

Op Sindoor

Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. మొత్తం 09 ప్రాంతాల్లోని ఉగ్ర శిబిరాలను, లష్కరే తోయిబా, జైషే మహ్మద్ కార్యాలయాలను క్షిపణులతో భారత్ నాశనం చేసింది. ఈ నేపథ్యంలో దాయాది భారత్‌పై ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉండటంతో భారత్ హై అలర్ట్ అయింది. ముఖ్యంగా, రాజస్థాన్, పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతా బలగాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయి.

Read Also: Operation Sindoor: ఫ్రారంభమైన అఖిలపక్ష సమావేశం

పాకిస్తాన్ వైపు నుంచి ఏదైనా ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లుగా పంజాబ్, రాజస్థాన్ అధికారులు సిద్ధమయ్యారు. పోలీసులకు సెలవులు రద్దు చేశారు. బహిరంగ సభల్ని పరిమితం చేశారు. పాకిస్తాన్‌తో 1037 కి.మీ సరిహద్దు కలిగిన రాజస్థాన్‌లో సరిహద్దును పూర్తిగా మూసేశారు. సరిహద్దుల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే కాల్చేయాలని ‘‘షూట్ అట్ సైట్’’ ఆర్డర్స్ జారీ చేశారు. మరోవైపు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిరంతరం సరిహద్దుల్లో గస్తీ కాస్తోంది. జోధ్‌పూర్, కిషన్‌గఢ్, బికనీర్ విమానాశ్రయాల నుంచి విమానాల రాకపోకల్ని నిలిపేశారు.

క్షిపణి రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేశారు. సుఖోయ్-30 ఎంకేఐ జెట్‌లు గంగానగర్ నుండి రాన్ ఆఫ్ కచ్ వరకు వైమానిక గస్తీ నిర్వహిస్తున్నాయి. బికనీర్, శ్రీ గంగానగర్, జైసల్మేర్, బార్మర్ జిల్లాల్లోని పాఠశాలలు మూసివేయబడ్డాయి. కొనసాగుతున్న పరీక్షలు వాయిదా వేశారు. పోలీసులు, రైల్వే సిబ్బంది సెలవులు రద్దు చేశారు. సరిహద్దు గ్రామాల్లో అత్యవసర ప్రతిస్పందన కోసం తరలింపు ప్రణాళికల్ని సిద్ధం చేశారు. సరిహద్దు సమీపంలో యాంటీ డ్రోన్ వ్యవస్థల్ని యాక్టివేట్ చేశారు.

Exit mobile version