Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు పిలుపునిచ్చారు. స్వాతి మలివాల్‌పై అతని సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశాడు. ఈ కేసులో నిన్న బిభవ్ కుమార్ అరెస్ట్ తర్వాత కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశాడు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చాడు. ఆప్ నేతలు, కార్యకర్తలు అందరం వస్తామని, అందర్ని ఒకటేసారి అరెస్ట్ చేయాలని సవాల్ చేశారు.
ఈ రోజు మార్చ్ చేయడానికి ముందు కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ ఎవరినైనా జైలుకు పంపొచ్చని, ఆప్‌ని బీజేపీ ముప్పుగా చూస్తోందని ‘‘ఆపరేషన్ ఝాదూ’’ అని, తన పార్టీని అణగదొక్కడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ‘‘ఆమ్ ఆద్మీ పార్టీని అణిచివేయాలని ప్రధాని భావిస్తున్నాడు’’ అని కేజ్రీవాల్ అన్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా ప్రముఖ ఆప్ నేతల్ని అరెస్ట్ చేయడం, పార్టీ బ్యాంకు ఖాతాల్ని స్వాధీనం చేసుకోవడం వంటి ఉన్నాయని చెప్పారు. వారి ఆపరేషన్ ఝాదూ కొనసాగుతోందని, నాకు బెయిల్ వచ్చినప్పటి నుంచి ప్రధాని ఆప్ గురించి మాట్లాడటం మానలేదని అన్నారు. ఆప్ గురించి దేశం మాట్లాడుతోందని, బీజేపీకి ముప్పు ఏర్పడుతుందని తమను అణగదొక్కాలని చూస్తున్నారని అన్నారు.
ఆప్ నేత స్వాతి మలివాల్‌పై దాడి కేసులో బిభవ్ కుమార్ అరెస్ట్ తర్వాత, కేజ్రీవాల్ నిన్న మాట్లాడుతూ.. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, ఢిల్లీ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్‌లతో సహా మరిన్ని అరెస్టులకు ప్లాన్ చేస్తున్నట్లు ఆరోపించారు. మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, సంజయ్ సింగ్ వంటి ఆప్ నేతల్ని వివిధ ఆరోపణలపై జైలుకు పంపడం ద్వారా ప్రధాని ఒక క్రమపద్ధతిలో తమను లక్ష్యం చేస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. తాము ఉచిత విద్యుత్, నీటిని అందిస్తున్నామని, తాము నిజాయితీతో డబ్బును ఆదా చేస్తున్నామని ఇది బీజేపీకి నచ్చడం లేని ఆయన అన్నారు.