ఒక దేశం, ఒకే ఎన్నికల బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. బిల్లును జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని మోడీ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఆలోచిస్తోంది. దీనిపై ఎన్డీఏ-2 ప్రభుత్వంలోనే మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలో కమిటీ వేసింది. దేశ వ్యాప్తంగా ఆయా పార్టీల అభిప్రాయాలను సేకరించి.. రిపోర్టును కేంద్రానికి అందించారు. దీనికి ఇటీవలే మోడీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బిల్లు పంపగా ఆమె కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇక పార్లమెంట్ ఉభయసభల్లో చర్చించడమే మిగిలి ఉంది. ప్రస్తుతం శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జమిలి బిల్లును ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
ఇదిలా ఉంటే జమిలి బిల్లును ఆమోదించేందుకు బీజేపీకి అంత బలం లేదని కాంగ్రెస్ పేర్కొంది. కచ్చితంగా బిల్లు వీగిపోతుందని తెలిపింది. మరోవైపు జమిలి ఎన్నికలను బీఎస్పీ అధినేత్రి మాయావతి స్వాగతించారు. ఇండియా కూటమి పార్టీలు మాత్రం ఈ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బిల్లు ప్రవేశపెడితే.. ఏం జరుగుతుందో చూడాలి.