‘One Earth, One Family, One future’: PM Modi unveils India’s G20 mantra: వచ్చే ఏడాది భారతదేశం జీ-20 సమావేశాలకు ఆథిత్యం ఇవ్వనుంది. దీనికి సంబంధించిన లోగోను, థీమ్ ను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మంగళవారం ఆవిష్కరించారు. ‘‘ఒకే సూర్యుడు,ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్ తో భారతదేశం పునరుత్పాదక ఇంధన విప్లవానికి నాయకత్వం వహించిందని.. భారతదేశం ఒక భూమి, ఒక ఆరోగ్యంతో ప్రపంచ ఆరోగ్య కార్యక్రమాన్ని బలోపేతం చేసిందని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పుడు జీ 20 కోసం భారతదేశం థీమ్ ‘‘ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
భారతదేశం 2023 జీ 20 సమావేశాలకు అధ్యక్ష బాధ్యత స్వీకరిస్తున్న సందర్భంగా దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు ప్రధాని మోదీ. లోగోపై ‘వసుధైక కుటుంబం’ అనే వ్యాఖ్యాలను లోగోపై ఉంచారు. ప్రపంచాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి భారతదేశ సంస్కృతి, వారసత్వం, విశ్వాసాలను కమలం ప్రతిబింభిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచాన్ని కోవిడ్-19 మహమ్మారి పరిణామాలను ఎదుర్కొంటోందని.. కమలం ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా వికసిస్తుందని.. ఆశల్ని ప్రతిబింబిస్తుందని ప్రధాని అన్నారు.
Read Also: EAM S Jaishankar: భారత ప్రయోజనాలే ఫస్ట్.. రష్యా నుంచి ఆయిల్ కొంటాం..
లోగోలోని కమలానికి ఉన్న ఏడు రేకులు ప్రపంచంలోని ఏడు ఖండాలను సూచిస్తాయని.. జీ20 ప్రపంచానికి ప్రాతినిధ్యం వహిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. స్వాతంత్య్రం అనంతరం భారతదేశం అభివృద్ధి వైపు ప్రయాణించడం ప్రారంభించిందని.. గత 75 ఏళ్లలో అన్ని ప్రభుత్వాల కృషి ుందని.. ప్రతీ ప్రభుత్వం, ప్రతీ పౌరుడు దేశాన్ని ముందుకు నడిపించేందుకు కృషి చేశారని అన్నారు. భారతదేశం ప్రతీ కష్టాన్ని అనుభవంగా మార్చుకుందని అన్నారు. భారతదేశం తన నైపుణ్యాలతో ప్రపంచాన్ని ఆకట్టుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు.
డిసెంబర్ 1న ఇండోనేషియా నుంచి భారత్ జీ20 అధ్యక్ష బాధ్యతలను తీసుకోనుంది. జీ 20 ప్రపంచ జీడీపీలో 85 శాతాన్ని, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతాన్ని, జనాభాలో మూడింట రెండొంతులు కలిగి ఉంది. వచ్చే ఏడాది భారత్ లో నిర్వహించబోయే జీ20 సదస్సులు దేశంలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. దీంట్లో కాశ్మీర్ కూడా ఉంది. మొత్తం 32 విభిన్న రంగాలకు చెందిన 200 సమావేశాలను భారత్ నిర్వహించనుంది.