S Jaishankar: భారత్-అమెరికా కలిసి పనిచేయడం చాలా అవసరమని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఇరు దేశాల బంధంపై పరిమితి విధించడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు దేశాలు ఒకరికొకరు కావాల్సిన, అనుకూలమైన, సౌకర్యవంతమైన భాగస్వాములుగా ఆయన అభివర్ణించారు. ఇటీవల యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు జైశంకర్ అమెరికా వెళ్లారు. దీంతో పాటు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, యూఎస్ జాతీయ భద్రతా సలహాదారుతో సమావేశమయ్యారు.
భారత-అమెరికా బంధం ఎక్కడి వరకు వెళ్తుందని తరుచుగా నన్ను అడిగే వారని, అయితే దానిపై పరిమితి విధించడం చాలా కష్టమని, ఎందుకంటే ఇరు దేశాల బంధం అంచనాలను మించి పోయిందని జైశంకర్ తెలిపారు. ఇస్రో చారిత్రాత్మక చంద్రయాన్ లూనార్ మిషన్ లాగేనే భారత్ – అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకుంటాయని జైశంకర్ పునరుద్ఘాటించారు.
Read Also: Rajnath Singh: అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే.. రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
జీ20 విజయవంతం కావడానికి అమెరికా నుంచి భారత్ కి సహకారం, మద్దతు లభించాయని అన్నారు. ఇది అక్షరాల జీ20 దేశాల విజయమని, భారత్-యూఎస్ భాగస్వామ్యం యొక్క విజయమని జైశంకర్ అన్నారు. చంద్రయాన్ లాగే ఈ బంధం కూడా చంద్రుడి పైకి వెళ్తుందని ఆయన అన్నారు. మారుతున్న సమాజంలో భారత్, అమెరికా ఒకరికొకరు చాలా కీలకమైన భాగస్వాములని తెలిపారు.
కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా ఆరోపణలు చేస్తున్న తరుణంలో అమెరికాలో జైశంకర్ పర్యటించారు. ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ ని జూన్ నెలలో కెనడాలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. అయితే ఈ హత్య విచారణలో కెనడాకు భారత్ సహకరించాలని అమెరికా కోరుతోంది.