Omar Abdullah Divorce: విడిపోయిన సీఎం దంపతులు.. 17 ఏళ్ల ఎడబాటుకి సుప్రీంకోర్టు విడాలకులతో ఆమోదం!

  • ఒమర్ అబ్దుల్లా - పాయల్ విడాకులు మంజూరు
  • సీఎం వ్యక్తిగత జీవితంలో కీలక మలుపు..
Cm Omar Abdullah

Cm Omar Abdullah

Omar Abdullah Divorce: జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆయన భార్య పాయల్ అబ్దుల్లా దాంపత్య బంధానికి అధికారికంగా ముగింపు పలికింది. దాదాపు 17 ఏళ్లుగా విడిగా జీవిస్తున్న ఈ దంపతులు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకోగా, వారి అభ్యర్థనకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. అలాగే ఒకరిపై ఒకరు దాఖలు చేసుకున్న అన్ని న్యాయపరమైన కేసులను ఉపసంహరించుకోవడానికి కూడా ఇరు పక్షాలు అంగీకరించాయి. ఈ కేసును జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ అలోక్ అరధే ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా ఇరు పక్షాల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, ఒమర్ అబ్దుల్లా – పాయల్ తమ మధ్య ఉన్న అన్ని విభేదాలను పరిష్కరించుకున్నారని కోర్టుకు తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద పరస్పర అంగీకారంతో వివాహ బంధాన్ని రద్దు చేయాలని కోరుతూ జూలై 22న సంయుక్త పిటిషన్ దాఖలు చేసినట్లు వివరించారు. ఒప్పందంలోని నిబంధనల ప్రకారం తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం పేర్కొంది.

ఒమర్ అబ్దుల్లా, పాయల్ 1994లో వివాహం చేసుకున్నారు. ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో పనిచేస్తున్న సమయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడి, ఆ తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి జహీర్, జమీర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే 2009 నుంచే ఇద్దరూ విడిగా నివసించడం ప్రారంభించగా, 2011లో తమ దాంపత్య జీవితం ముగిసిందని ఒమర్ అబ్దుల్లా బహిరంగంగా ప్రకటించారు. విడాకుల కోసం ఒమర్ అబ్దుల్లా ముందుగా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించినప్పటికీ, 2016లో ఆ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అనంతరం ఆయన ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేశారు. 2023 డిసెంబర్‌లో హైకోర్టు కూడా ఫ్యామిలీ కోర్టు తీర్పును సమర్థిస్తూ, పాయల్‌కు నెలకు రూ.1.5 లక్షల భరణం, కుమారుడి విద్య కోసం అదనంగా నెలకు రూ.60 వేల చెల్లించాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వును సుప్రీంకోర్టులో సవాలు చేసిన ఒమర్ అబ్దుల్లా కేసు మధ్యవర్తిత్వానికి వెళ్లింది. అక్కడ ఇరు పక్షాలు పరస్పర అవగాహనకు వచ్చి, అన్ని వివాదాలకు ముగింపు పలకడంతో సుప్రీంకోర్టు వారి విడాకులకు అధికారికంగా ఆమోదం తెలిపింది.