Kendriya Vidyalaya Seats: కేంద్రీయ విద్యాలయాల అడ్మిషన్లలో ఎంపీ కోటాను పునరుద్దరించే ప్రతి పాదన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి రాజ్యసభలో కేంద్రం సోమవారం లిఖిత పూర్వక సమాధానమిచ్చింది. కేంద్రీయ విద్యాలయాల ప్రవేశాల్లో ఎంపీ కోటాను కేంద్రం గతేడాది రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ కోటాను తిరిగి పునరుద్ధరించే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో ఈ అంశంపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. కేంద్రీయ విద్యాలయాల ప్రవేశాల్లో ఎంపీ కోటా తిరిగి పునరుద్దరించే ప్రతిపాదన ఏదీ కేంద్రం దగ్గర లేదని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ‘‘రక్షణ, పారా మిలిటరీ, కేంద్ర స్వయంప్రతిపత్తి సంస్థలు, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ వంటి కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే సిబ్బంది తరచూ బదిలీలపై వెళ్తుంటారు. కాబట్టి, వారి పిల్లల చదువుకు ఆటంకం కలగకుండా దేశవ్యాప్తంగా ఒకే విధమైన విద్యను నేర్చుకునేందుకు వీలుగా కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించారు’’ అని కేంద్రమంత్రి తెలిపారు.
Read also: Heart Attack: నితిన్ దర్శకుడికి హార్ట్ ఎటాక్.. తీవ్ర విషమంగా హెల్త్ కండిషన్!
‘‘కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఎంపీ సహా ఇతర కోటాలను అనుమతిస్తే తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిపోతోంది. ఇది బోధనపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అందుకే వాటిని రద్దు చేశాం. పార్లమెంట్ సభ్యుల కోటాను మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి కేంద్రం వద్ద లేదు’’ అని మంత్రి తన సమాధానంలో స్పష్టం చేశారు. కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల కోసం ఎంపీలతో సహా అనేక విచక్షణ కోటాలను కేంద్ర ప్రభుత్వం గత ఏడాది రద్దు చేసింది, ఈ నిర్ణయం కేంద్ర నిధులతో నడిచే పాఠశాలల్లో 40,000 సీట్లకు పైగా ఖాళీని కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో 14.35 లక్షల మంది విద్యార్థులతో 1,200 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. లోక్‌సభలో 543 మంది ఎంపీలు.. రాజ్యసభలో 245 మంది ఎంపీలు తమ కోటా కింద సంవత్సరానికి 7,880 అడ్మిషన్‌లను సమిష్టిగా సిఫార్సు చేసే అవకాశం ఉంటుంది. ప్రత్యేక నిబంధనల ప్రకారం, 10 మంది పిల్లలను కేంద్రీయ విద్యాలయలో చేర్చుకోవడానికి సిఫారసు చేయడానికి ఎంపీలకు విచక్షణాధికారాలు ఉన్నాయి. కేవీలలో స్పాన్సరింగ్ అథారిటీ కోటా కింద 17 మంది విద్యార్థులను సిఫారసు చేసే అధికారం జిల్లా మేజిస్ట్రేట్‌కు కూడా ఉంది.