Wrestlers Protest: భారత రెజ్లర్ల సమాఖ్య(WFI) చీఫ్, బీజేపీ ఎంపీ అయిన బ్రిజ్ శరణ్ సింగ్ పై లైంగిక వేధింపుల ఆరోపణ కేసులో వెంటనే అరెస్ట్ చేయడంతో పాటు పదవి నుంచి తొలగించాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్నారు. పలువురు మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించాడనే ఆరోపణల్ని బ్రిజ్ శరణ్ సింగ్ ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఈ రోజు హరిద్వార్ వద్ద తమ పథకాలను గంగలో కలిపేస్తామని రెజ్లర్లు హెచ్చరించారు.
Read Also: Apollo Hospitals: దూసుకుపోయిన అపోలో హాస్పిటల్స్.. నాలుగో త్రైమాసికంలో లాభం ఎన్ని కోట్లంటే
మెడల్స్ ను గంగలో కలిపేసిన తర్వాత ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయితే ఇండియా గేట్ వద్ద ఎలాంటి నిరసనలు, ఆందోళనకు అనుమతించమని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. మరేదైనా ప్రదేశంలో నిరసన తెలపడానికి పోలీసులు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుమన్ నల్వా తెలిపారు. అంతకుముందు జంతర్ మంతర్ వద్ద నుంచి రెజ్లర్లను పోలీసుల ఖాాళీ చేయించారు.
‘‘ఈ పతకాలే మా ప్రాణం.. మా గంగ కాబట్టి వాటిని గంగలో నిమజ్జనం చేయబోతున్నాం.. ఆ తర్వాత బతికే ప్రసక్తే లేదని ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటాం.’’ అని 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ హిందీలో ట్వీట్ చేశారు. ఈ వ్యవస్థ తమను తప్పుగా చూస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం రోజు కొత్తపార్లమెంట్ ముందు నిరసన తెలిపేందుకు వెళ్తున్న రెజ్లర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఇది ఉద్రిక్తతలకు దారి తీసింది.