Lok Sabha Elections 2024: ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన బస్తన్ నియోజకవర్గానికి తొలిదశలో నిన్న ఎన్నికలు జరిగాయి. బీజాపూర్, కుంట, జగదల్‌పూర్, దంతేవాడ, సుక్మా వంటి ప్రాంతాలు బస్తర్ ఎంపీ స్థానంలో భాగంగా ఉన్నాయి. దండకారణ్యంతో కూడుకున్న ఈ ప్రాంతం మావోయిస్టులకు పెట్టని కోటలా ఉంటోంది. అయితే, నిన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం దండకారణ్యంలోని చాలా గ్రామాల్లోని ప్రజలు ఓటేసేందుకు ఉత్సాహం చూపించారు. ఓ వైపు ఎన్నికల్ని బహిష్కరించాలని మావోయిస్టులు ఇచ్చిన హెచ్చరికల్ని ఖాతరు చేయలేదు.
అయితే, ఒక్క గ్రామం మాత్రం ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. హార్ట్ కోర్ మావోయిస్టు నాయకుడిగా, మావోయిస్టు వ్యూహకర్తగా పేరున్న హిడ్మా సొంతూరు లోని ప్రజలు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఈ గ్రామం నుంచి ఒక్కరూ కూడా ఓటేయడానికి రాలేదు. బీజాపూర్ జిల్లా సరిహద్దులో ఉన్న సుక్మా జిల్లా పరిధి కిందకు వచ్చే పువర్తి గ్రామంలో ప్రజలు ఓటేయలేదు. అనేక భయంకరమైన దాడులకు హిడ్మా పథక రచన చేసి, అమలు చేశాడనే పేరుంది. భద్రతా బలగాలకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు.
Read Also: kishan reddy: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన గ్యారంటీలు ఏమయ్యాయి
శుక్రవారం జరిగిన ఎన్నికల్లో బస్తర్‌లో ఓటింగ్ శాతం 67.56 శాతంగా నమోదైంది. అయితే పువర్తి నుంచి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోలేదని బూల్ లెవల్ ఆఫీసర్ జావా పటేల్ చెప్పారు. గ్రామంలోని ఓటర్లు భయంతో ఓటేయలేదని అధికారులు తెలిపారు. పువర్తి పోలింగ్ బూత్(నంబర్ 4) అనేది పువర్తి, టేకల్ గుడియం, జోనగూడ అనే మూడు గ్రామాల కోసం పెట్టారు. దీనిని పువర్తికి 20-25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిల్గర్ అనే గ్రామంలో ఏర్పాటు చేశారు.
పువర్తిలో 332 మంది, టేకల్‌గుడియంలో 158 మంది, జోనగూడలో 157 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం బూత్ పరిధిలో 547 మంది ఓటర్లు ఉన్నారు. ఈ బూత్ పరిధిలో మొత్తం 31 మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, అయితే వీరిలో ఒక్కరూ కూడా పువర్తికి చెందిన వారు కాదని, టేకల్ గుడియ, జోనగూడకు చెందిన వారని అధికారులు తెలిపారు. బస్తర్ లోక్‌సభ స్థానం, సుక్మా జిల్లా పరిధిలోని కొంటా అసెంబ్లీ నియోజకవర్గంలో 54.31 శాతం పోలింగ్ నమోదైంది.
ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టుల జాగరగుండ ఏరియా కమిటీ పువర్తి పరిసర గ్రామాల్లో బ్యానర్లు ఏర్పాటు చేసింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఛత్తీస్‌గఢ్ పోలీసులు పువర్తిలో శిబిరం ఏర్పాటు చేశారు. ఇది మావోయిస్టుకు వ్యతిరేకంగా భద్రతా బలగాలు అతిపెద్ద విజయంగా భావిస్తున్నారు. మావోయిస్టుల PLGA (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) బెటాలియన్ నంబర్ 1 యొక్క మాజీ కమాండర్ హిద్మాతో పాటు ప్రస్తుత కమాండర్ బార్సే దేవాల స్వగ్రామం. ఈ బెటాలియన్ దక్షిణ బస్తర్ అనేక ఘోరమైన దాడులకు పాల్పడింది.