Assam: అస్సాం ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కొత్తగా డ్రెస్ కోడ్ తీసుకువచ్చింది. అస్సాం ప్రభుత్వం శనివారం ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. జీన్స్, లెగ్గింగ్స్ నిషేధిస్తున్నట్లు అధికారులు నోటిఫికేషన్ లో వెల్లడించారు. పాఠశాలల్లో టీషర్టులు, జీన్స్, లెగ్గింగ్స్ వంటివి ధరించరాదని రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉపాధ్యాయులు తమ విధులను నిర్వర్తించే సమయంలో మర్యాదకరమైన డ్రెస్సింగ్ ఉండాలని, అందుకని కొత్త డ్రెస్ కోడ్ పాటించాల్సిన అవసరం ఉందని పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ లో పేర్కొంది.
Read Also: Rajasthan: మృత్యుంజయుడు.. బోరుబావిలో పడిన 9 ఏళ్ల బాలుడిని రక్షించిన అధికారులు..
కొందరు విద్యాసంస్థల ఉపాధ్యాయులు తమకు నచ్చిన దుస్తుల్లో పాఠశాలలకు వస్తున్నారని, కొన్ని సార్లు ఇది ఆమోదయోగ్యంగా అనిపించదని, ఉపాధ్యాయులు అన్ని రకాల మర్యాలు పాటించాల్సి ఉంటుందని, పాఠశాలల్లో విధులు నిర్వర్తించే సమయంలో ప్రొఫెషనలిజం కనిబడేటట్లు డ్రెస్సింగ్ ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. పురుష, మహిళా ఉపాధ్యాయులు మర్యాదపూర్వకమైన దుస్తులు ధరించి హుందాగా కనిపించాలని ఆదేశించింది. క్యాజువల్స్, పార్టీ వేర్ దుస్తులకు దూరంగా ఉండాలని సూచించింది.
టీషర్ట్స్, జీన్స్ కాకుండా ఫార్మల్ దుస్తుల్లో మగ టీచర్లు పాఠశాలలకు రావాలని, అదే విధంగా మహిళా టీచర్లు సల్వార్ సూట్, సారీ వంటి ఫార్మల్ దుస్తుల్లో రావాలని ఆదేశించారు. ఒకవేళ ఈ డ్రెస్ కోడ్ పాటించకుంటే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ పేర్కొంది. దీనిపై అస్సాం విద్యాశాఖ మంత్రి డాక్టర్ రనోజ్ పెగు స్పందిస్తూ, అస్సాం ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పాఠశాల నియమ పుస్తకాన్ని ప్రవేశపెట్టబోతోంది, ఇది పాఠశాలను ఎలా నిర్వహించాలి మరియు తరగతులు ఎలా నిర్వహించాలనే దాన్ని వెల్లడిస్తాయని తెలిపారు.