Ayushman Bharat Scheme: ఆయుష్మాన్ భారత్ పథకం విషయంలో ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ లభించింది. ఈ పథకానికి సంబంధించిన ఎంవోయూపై సర్కార్ సంతకాలు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు కొట్టివేసింది. జనవరి ఐదో తేదీకల్లా దేశ రాజధానిలో ఈ పథకం ప్రవేశ పెట్టేందుకు అవసరమైన ఎంవోయూపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంతకాలు చేయాలని గత నెలలో ఢిల్లీలోని ఉన్నత న్యాయస్థానం ఆదేశించగా.. వాటిని సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో ఆప్ సర్కార్ ఓ పిటిషన్ దాఖలు చేసింది. ఇక, విచారణ చేసిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం.. ఈరోజు (జనవరి 17) హైకోర్టు ఆదేశాలను నిలుపుదల చేస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చింది.
Read Also: Imran Khan : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్లు.. బుష్రా బీబీకి 7 ఏళ్ల జైలు శిక్ష
అలాగే, కేంద్ర ప్రభుత్వం, ఎయిమ్స్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ పిటిషన్‌పై వివరణ కోరుతూ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే, ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కేంద్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఢిల్లీలోనూ దీనిని ప్రవేశ పెట్టాలని ప్రయత్నించింది. కానీ, దేశ రాజధానికి ఈ పథకం అవసరం లేదని.. ఇక్కడి ప్రజలు రాష్ట్ర సర్కార్ సంక్షేమ పథకాలతోనే ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారని ఆప్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. ఇది రాజకీయ దుమారానికి దారి తీసింది.