NTV Telugu Site icon

Sanjay Raut: త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి సంజయ్ రౌత్..?.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు!

Sanjay

Sanjay

మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత నితీశ్ రాణే శివసేన(యూబీటీ)సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే సంజయ్ రౌత్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నాడని వెల్లడించాడు. ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఢిల్లీలోని ఓ నాయకుడితో చర్చలు జరుపుతున్నారని నితీశ్ రాణే ఆరోపించారు. సంజయ్‌ రౌత్‌ రాజ్యసభ పదవి కాలం ముగిసే సమయం ఆసన్నమైంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని పార్టీకి ఆయనను మరో దఫా గెలిపించేంత మంది ఎమ్మెల్యేలు లేరని నితీష్ రాణే అన్నారు.

నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ 20 స్థానాలు మాత్రమే దక్కించుకోగలిగింది. ఇక పార్టీ భవిష్యత్తు గురించి అర్థం చేసుకున్న సంజయ్‌ రౌత్‌ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు అని మంత్రి నితీశ్ రాణే ఆరోపించారు. రౌత్‌ ఇంకా ఎంతకాలం శివసేనలో కొనసాగుతారు..?కాంగ్రెస్‌లో చేరేందుకు దిల్లీలో చర్చలు జరుపుతున్న నేత గురించి ‘సామ్నా’లో రాయాలి. సంజయ్‌ రౌత్‌ కూడా తన ఉద్దేశాన్ని అధికారికంగా ప్రకటించాలి, కాంగ్రెస్ కూడా ఈ అంశంపై స్పందించాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి, శివసేన నాయకుడు ఏక్‌నాథ్ షిండే మధ్య విభేదాల కారణంగా రాష్ట్రంలో పాలన దెబ్బతింటోందని సంజయ్ రౌత్ ఇటీవల పేర్కొన్నాడు. షిండే సీఎం పదవి కోసం పోరాడుతున్నారని ఈ విషయంపై ఇరువురి మధ్య విభేదాలు తలెత్తాయంటూ ఆరోపించారు. ఇది రాష్ట్ర ప్రజలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఇటీవల సామ్నాలో సంజయ్‌ పేర్కొన్నారు. దీనిపై తాజాగా స్పందించిన మంత్రి నితీశ్ రాణే సంజయ్‌ రౌత్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.