Nitish Kumar: బిహార్‌లో మహాకూటమి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఎనిమిదోసారి ప్రమాణస్వీకారం చేశారు. బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది క్షణాల తర్వాత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మహాకూటమిలోని అన్ని పార్టీలు ఐక్యంగా ఉండాలన్నారు. కొత్త ప్రభుత్వం ఎక్కువ కాలం పాటు కొనసాగలేదంటూ భాజపా చేసిన వ్యాఖ్యల్ని కొట్టిపారేశారు. తమ ప్రభుత్వం బాగానే నడుస్తుందని వ్యాఖ్యానించారు. 2024 లోక్‌సభ ఎన్నికల విషయంలో బీజేపీ ఆందోళన చెందుతోందన్నారు. కేంద్రంలో భాజపాను గద్దె దించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ గెలిచారనీ.. కానీ 2024లో ఆ పార్టీకి ఉండే అవకాశాలపై ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. 2024లో ఆయన గెలుస్తారా? అన్నదే తన ప్రశ్న అన్నారు. ప్రధాని పదవికి తాను పోటీదారుగా లేనన్నారు. బీజేపీని వీడాలని తమ పార్టీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని నితీష్ స్పష్టం చేశారు.
జేడీయూ, ఆర్జేడీ తదితర పార్టీల కూటమి ప్రభుత్వం బుధవారం ఏర్పాటైన విషయం తెలిసిందే. రాజ్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఇరువురూ పరస్పరం ఆత్మీయతను పంచుకున్నారు. నితీశ్‌కు పాదాభివందనం చేసేందుకు తేజస్వీ ప్రయత్నించగా, నితీష్ చిరునవ్వుతో అడ్డుకున కరచాలనం చేశారు. బీజేపీకి రెండోసారి షాక్ ఇస్తూ ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ మంగళవారం బయటకు వచ్చేసింది.
Nitish Kumar: బిహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం
అంతకుముందు బీజేపీ నేత సుశీల్ మోదీ నితీష్ కుమార్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ నేతృత్వంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం తన పదవీ కాలం ముగియక ముందే పతనమవుతుందన్నారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్య పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకుని ఆ పార్టీని చీల్చుతారని ఆరోపించారు. మాజీ కేంద్ర మంత్రి ఆర్‌సీపీ సింగ్ ద్వారా జేడీయూను చీల్చేందుకు బీజేపీ కుట్ర పన్నిందని జేడీయూ చేస్తున్న ఆరోపణలను కూడా సుశీల్ మోదీ తోసిపుచ్చారు. నితీష్ కుమార్ అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే సింగ్‌కు కేంద్ర మంత్రి పదవిని ఇచ్చినట్లు తెలిపారు.
బీజేపీతో పొత్తును తెంచుకుని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత బిహార్‌లో ఏడు పార్టీల మద్దతుతో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జనతాదళ్-యునైటెడ్ నాయకుడు నితీష్ కుమార్ మంగళవారం తెలిపారు. ఆర్జేడీ సహా ఏడు పార్టీలు తనకు మద్దతిస్తున్నాయని చెప్పారు. మహాఘటబంధన్‌లో స్వతంత్రులతో పాటు 164 మంది ఎమ్మెల్యేలు సహా 7 పార్టీలు ఉన్నాయని ఆయన మీడియాతో వెల్లడించారు. ఆ సమయంలో ఆయన వెంట ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉన్నారు. 243 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీలో జేడీయూ, ఆర్జేడీ కలిసి మెజారిటీని కలిగి ఉన్నాయి. జేడీయూకి 45, ఆర్జేడీకి 79 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరికి జితన్ మాంఝీకి చెందిన హెచ్‌ఏఎం వంటి చిన్న పార్టీల మద్దతు కూడా ఉంది. రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి 77 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నితీష్ కుమార్ రాజీనామాకు ముందు హైవోల్టేజ్ రాజకీయాలకు బిహార్ వేదికైంది.