Nitis Kumar’s comments on Prime Ministerial candidature: బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఎన్డీయేతర కూటమికి సంబంధించిన పార్టీ నాయకులను వరసగా కలుస్తున్నారు. ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు నితీష్ కుమార్. అయితే ఇప్పటికే ఆర్జేడీ పార్టీలో పాటు జేడీయూ కూడా నితీష్ కుమార్ 2024లో ప్రధాని రేసులో ఉంటారని వ్యాఖ్యానించాయి. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో నితీష్ కుమార్ విపక్షాల ప్రధాన మంత్రి అభ్యర్థి అని జరుగుతున్న ప్రచారాన్ని తిప్పి కొట్టారు. తాను ప్రధాన మంత్రి పదవికి హక్కుదారు కాదని.. ప్రధాని మంత్రి కావాలనే కోరుకునే వాడిని కాదని ఆయన వ్యాఖ్యానించారు.
సీపీఐ-ఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరితో సమావేశం అనంతరం నితీష్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. వామపక్షాలు, కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. నా చిన్నప్పటి నుంచి సీఐఐతో సుదీర్ఘ అనుబంధం ఉందని.. మనమంతా ఏకతాటిపైకి వస్తే పెద్ద విషయం అవుతుందని.. ఆయన అన్నారు. విపక్షాలను ఏకం చేయడంపై దృష్టి సారించినట్లు ఆయన వెల్లడించారు. 2024 ఎన్నికల్లో విపక్షాలను ఏకం చేసే పనిలో ఉన్నారు సీఎం నితీష్ కుమార్.
Read Also: Bharat Biotech’s Nasal Vaccine: కోవిడ్ 19 నాసిల్ వ్యాక్సిన్‌కు కేంద్రం ఆమోదం
మంగళవారం సాయంత్రం సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ. రాజాతో సీఎం నితీష్ కుమార్ భేటీ కానున్నారు. సోమవారం ఢిల్లీకి వెళ్లిన నితీష్ కుమార్, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, జనతాదళ్-సెక్యులర్(జేడీఎస్) అధినేత, కుమారస్వామిని కలిశారు. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో ఈ రోజు భేటీ అయ్యారు. దీంతో పాటు ఎన్సీపీ నేత శరద్ పవార్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఐఎన్డీడీకి చెందిన ఓం ప్రకాశ్ చౌతాలా వంటి ప్రతిపక్ష నేతలను కలిసే అవకాశం ఉంది.