Nimisha Priya Case: యెమెన్‌లో ఉరిశిక్ష ఎదుర్కొంటుున్న కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియా కేసులో కేంద్రం శుక్రవారం కీలక ప్రకటన చేసింది. మరణశిక్ష రద్దు నివేదికల్ని భారత్ తిరస్కరించింది. ఈ కేసుపై భారత్, యెమెన్‌తో కలిసి పనిచేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) తెలిపింది. ఈ కేసులో తప్పుడు సమాచారంతో ప్రజలు మోసపోవద్దని విజ్ఞప్తి చేసింది. అయితే, ఆమెకు విధించిన మరణశిక్షను వాయిదా వేసినట్లు భారతదేశం శుక్రవారం ధ్రువీకరించింది. అయితే, ఉరిశిక్ష రద్దు చేస్తున్నట్లు వస్తున్న నివేదికల్ని తోసిపుచ్చింది.
నిమిషా, ఆమె కుటుంబంతో ప్రభుత్వం క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతోందని, సమస్యను త్వరగా పరిష్కరించడానికి స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తోందని విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. ‘‘మా సమిష్టి ప్రయత్నాల ఫలితంగా, యెమెన్‌లోని స్థానిక అధికారులు ఆమెకు శిక్ష అమలును వాయిదా వేశారు. మేము ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తూనే ఉన్నాము మరియు సాధ్యమైన అన్ని సహాయాన్ని అందిస్తున్నాము. ఈ విషయంపై మేము కొన్ని స్నేహపూర్వక ప్రభుత్వాలతో కూడా సంప్రదిస్తున్నాము’’ అని అన్నారు.
Read Also: National Film Awards 2025: హను-మాన్ సినిమాకు రెండు, బలగంకు ఓ అవార్డ్.. తెలుగు ఫుల్ లిస్ట్ ఇదే!
‘‘ఆమె మరణశిక్ష రద్దు చేయబడిందని, ఆమె విడుదల కోసం ఒక ఒప్పందం కుదిరిందని చెప్పే నివేదికలు తప్పు. ఇది సున్నితమైన విషయం,తప్పుడు సమాచారం నుండి దూరంగా ఉండాలని మేము అన్ని వర్గాలను కోరుతున్నాము’’ అని విదేశాంగ శాఖ చెప్పింది.
38 ఏళ్ల నిమిషా ప్రియా కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఉపాధి కోసం 2008లో యెమెన్ కు వెళ్లింది. ఆ దేశస్తుడు అయిన తలాబ్ అబ్దో మహదీతో కలిసి సంయుక్తంగా ఒక క్లినిక్ ప్రారంభించారు. ఆ తర్వాత మహదీ ఆమె తన భార్య అని చెప్పుకుని, పాస్‌పోర్టు స్వాధీనం చేసుకున్నాడు. అయితే, ఆమె తన పాస్‌పోర్టు పొందే క్రమంలో 2017లో మహదీకి మత్తు ఇంజక్షన్ ఇచ్చి, పాస్‌పోర్టు తీసుకోవాలని అనుకుంది. ఆ ఇంజక్షన్ వికటించి అతను మరణించాడు. 2018లో అక్కడి ప్రభుత్వం ఆమెను దోషిగా నిర్ధారించి, 2020లో మరణశిక్ష విధించింది. ఈ కేసులో భారత ప్రభుత్వం, మతపెద్దల దౌత్యపరమైన జోక్యాల కారణంగా శిక్ష వాయిదా పడుతూ వస్తోంది.