Nimisha Priya case: హత్య ఆరోపణలపై యెమెన్ దేశంలో మరణశిక్ష విధించబడిన భారతీయ మహిళ నిమిషా ప్రియ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ‘‘ మానవతా కారణాల’’ దృష్ట్యా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉణ్నట్లు ఇరాన్ సీనియర్ అధికారి గురువారం తెలిపారు. డిసెంబర్ 31, 2024న కేరళ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు వీడీ సతీషన్ ఆమెను కాపాడేందుకు కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సేవ్ నిమిషా ప్రియా ఫోరమ్‌కి చెందిన బాబు జాన్ మాట్లాడుతూ.. ‘‘మనకు సమయం లేదు, ఉరి శిక్షను ఆపేందుకు ప్రభుత్వం వెంటనే యెమెన్ ప్రభుత్వంతో మాట్లాడాలి.’’ అని కోరారు.
ప్రస్తుతం ఇరాన్ విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి డాక్టర్ తఖ్త్ రావంచి ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. ఇరాన్‌కి యెమెన్‌కి అత్యంత స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాల ద్వారా నిమిషా శిక్షను రద్దు చేసే అవకాశం ఉంది. జూలై 25, 2017లో నిమిషా తలాల్ అబ్దు మహదీ అనే వ్యక్తిని హత్య చేసి, అతడి శరీర భాగాలను ముక్కలు చేసి వాటర్ ట్యాంక్‌లో పారేసిన కేసులో దోషిగా తేలింది. కొన్ని రోజుల క్రితం యెమెన్ అధ్యక్షుడు రషన్ అల్ అలిమీ ఆమె మరణశిక్షను సమర్థించారు.
Read Also: AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్.. 14 అంశాల ఎజెండాలకు ఆమోదం! ప్రధాని పర్యటనపై చర్చ
ఏమిటి నిమిషా ప్రియా కేసు..?
యెమెన్ దేశంలో నర్సుగా పనిచేసేందుకు వెళ్లిన నిమిషా అనూహ్యంగా హత్య కేసులో ఇరుక్కుంది. నర్సుగా యెమెన్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో కొన్ని సంవత్సరాలు పనిచేసింది. 2014లో ఆమె భర్త, మైనర్ కుమార్తె ఆర్థిక కారణాల వల్ల భారత్ తిరిగి వచ్చారు. అదే ఏడాది యెమెన్ అంత్యర్ధుద్ధంలో చిక్కుకుంది. దేశం కొత్త వీసాలు జారీని నిలిపివేసినందుకు తిరిగి వెళ్లలేకపోయారు.
అయితే, 2015లో నిమిషా యెమెన్ రాజధాని సనా వెళ్లిన నిమిషా అక్కడ స్థానిక యెమెన్ జాతీయుడైన మహదీతో ఓ క్లినిక్ ఓపెన్ చేసింది.యెమెన్ చట్టం ప్రకారం, క్లినిక్‌లు మరియు వ్యాపార సంస్థలను స్థాపించడానికి జాతీయులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె మహదీ మద్దతు కోరింది. ఆ తర్వాత పరిణామాల్లో మహదీ ఆమెను వేధించడం ప్రారంభించాడు. ఆమె పాస్‌పోర్టుని లాక్కుని వేధింపులకు గురిచేశాడు. ఆమెను పెళ్లి చేసుకున్నట్లుగా అనేక దొంగ సాక్ష్యాలు సృష్టించాడు. ఈ నేపథ్యంలోనే ఆమె తన పాస్‌పోర్టుని లాక్కోవడానికి మహదీకి మత్తుమందు ఇంజెక్షన్ ఇచ్చింది. ఇది వికటించి అనుకోకుండా అతను మరణించాడు.
ఈ కేసుపై ఇటీవల భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మాట్లాడుతూ.. నిమిషా ప్రియా కేసులో మరణశిక్ష పడిన విషయం మాకు తెలుసు, ఈ విషయంలో భారత ప్రభుత్వం అన్ని విధాల సహాయాన్ని అందిస్తోందని చెప్పారు.